పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

శ్రీనివాసవిలాససేవధి


విలసితకారుణ్యవిగ్రహ యగుచు
ప్రారబ్ధము లడంచి భక్తకోటులకుఁ
గోరినయిష్టముల్ గొబ్బున నొసఁగఁ
జాలు న య్యిందిరన్ శరణుగాఁ జెంది
మే లొందు మనుడు భూమీసురుం డలరి 170
మౌనీంద్రునకుఁ జాల మఱిమఱి మ్రొక్కి
పూనికఁ గేల్మోడ్చి పొగడి వెండియును
మునివర్య యాదేవిఁ బొడగాంచు టెట్లు
దనరు నెచ్చట నెట్లు ధ్యాన మెబ్భంగి
యెందు ప్రసన్నయౌ నిలలోకజనని
పొందుగాఁ దెలుపు మిప్పుడె యట్లసేతు
నని యడిగిన వాని నాయోగి కరుణఁ
గని విను స్వామిపుష్కరిణిచెంగటను
వరదుఁ డయిన శ్రీనివాసు పేరురమె
యిరవుగా నెలకొని యీవ్యూహలక్ష్మి 180
పొందమ్మిగద్దె ద్విభుజయై వసించు
కుందనపుంబొమ్మ కొమరు మీఱంగ
నాయిందిరం దిరమైన సద్భక్తి
పాయక మదినిల్పి స్వామిపుష్కరిణి
పావనోదకములన్ బరిశుద్ధి గాంచి
భావంబునన్ రమాపతిని భావింపు
మపుడె ప్రసన్నుఁడై యల శ్రీనివాసుఁ
డపరిమితప్రేమ నందుఁ గన్పట్టి
నీనుఁ గృతార్థునిఁ జేయు నిక్కమం చొక్క
మనువుపదేశింప మదిఁదాల్చి యతఁడు 190