పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

శ్రీనివాసవిలాససేవధి


స్ఫటికాక్షమయమైన జపమాలికయును
కట్టినపులితోలు ఘనకమండలము
పట్టినదండంబు పటుయజ్ఞ సూత్ర
మరమోడ్పుకనుదోయి యచలసంస్థితియు
మెరయ మంత్రావృత్తి యెదల నోష్ఠములు 120
హరిపదధ్యానయోగానందసింధు
పరివాహమగ్నహృత్పద్మతనుండు
వై రాగ్యజితమారు వారిజోద్భవకు
మారునట్టి సనత్కుమారుఁ గన్గొనియె
కని నిర్జనాధిత్య కావనంబునను
వినుతతేజఃపుంజవిగ్రహుం డగుచు
కనుపట్టెడి నితండు కమలసంభవుఁడొ
వనజారి మౌళియొ వనజలోచనుఁడొ
గాకున్న మునుల కీకాంతిరూపములు
చేకురు టెబ్బంగి చిరతపఃక్లేశ 130
మనుభవింపుచు డస్సి యస్థులై యెండి
కనువేదు రయ్యుండఁ గనమె యమ్మునుల
సుకుమారవంతుఁ డాసురుచిరాకారుఁ
డకళంకమోదంబు నలరించె మదికి
నీమహామహుఁడు నాయెడఁ దీర్పఁజాలు
వేమారు కారుణ్య విభవంబుచేత
ననుచు నూహదలంచి యాయోగి యెదుట
జని భక్తి సాగిలి సాష్టాంగమెఱగి
దీనవత్సల ! కృపాదృష్టిచే నన్ను
పూని రక్షింపు నాపూర్వదుష్కృతము 140