పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రమథు డగుట యనువానితో గూడినది చతుర్థాశ్వాసము.

తన భటుల పరాభవమును విన్న యముడు చిత్రగుప్తుని సంప్రదించి తన యశక్తాధికారము శివునకే విన్నవింప నిశ్చయించుకొని కైలాసమున కేగుట, కైలాసవర్ణనము, శివసందర్శనము, శివస్తుతి, యముడు సుకుమారుని పాపకార్యములు శివునికి వినిపించుట, శివుడు యమునకు శివరాత్రిమాహాత్మ్యము శివభక్తుల లక్షణములు చెప్పుట, యముడు తన లోకమునకు తిరిగివచ్చి తన భటులకు శివరాత్రిమాహాత్మ్యము శివభక్తుల లక్షణములు మరల చెప్పుటతో పంచమాశ్వాసము ముగియును.

ఈ శివరాత్రిమాహాత్మ్యమునకే సుకుమారచరిత్రమని నామాంతరము కనుక శ్రీనాథు డీ సుకుమారుని కథను ప్రబంధోచితవర్ణనలతో పెంచి అట్టి దుష్టుడు కూడ శివరాత్రి దర్శనమున పూతుడైనట్లు స్థాపించెను. కాశీఖండమున (IV. 76-163) గల గుణనిధి కథ యిట్టిదే. పాపకార్యములందు గుణనిధి వెన్నుదన్ని పుట్టినవా డీ సుకుమారుడు. సుకుమార చరిత్రమున శ్రీనాథుడు నైషధము కాశీఖండము మున్నగు తన పూర్వకృతుల నుండియే కాక భట్టబాణుని కాదంబరిలోని రసవంతములగు భాగము లనేకము గ్రహించెను. కనుకనే పూర్వకవిస్తుతి యొనర్చు సందర్భమున అవతారికలో శ్రీనాథుడు తొట్టతొలుత “బాణు నద్భుతశాస్త్ర బహుకళాపారీణు” (I-12) గొనియాడెను.

గీ. వానిఁ గలలోనఁ గానని వనజముఖియు
    వాని మార్పునఁ బేర్కొని మానవతియు
    వానిఁగా నాత్మ భావించి వరునిఁ గవయ
    నప్పళింపని సతియు లేదయ్యె నచట

అను శృంగార నైషధమందలి (I-62) పద్యము శివరాత్రిమాహాత్మ్యమున (II-94) రసవత్తమముగా విస్తరింపబడినది.

కాశీఖండము గుణనిధి చరిత్రమందలి (IV-114) పద్య మున్నదున్నట్లు శివరాత్రిమాహాత్మ్యమున (III-19) అవతరించినది. కాశీఖండమున శివదూతలకును యమదూతలకును జరిగిన సంవాదమందలి (IV-127) పద్యములోని మాటలు కొన్ని శివరాత్రిమాహాత్మ్యమున (IV-73) చేరినవి.

పుష్పదంతుని మహిమ్నస్తవమందలి

“అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయో
రతద్వ్యావృత్యా యం చకిత మభిధత్తే శ్రుతి రపి
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః”

అను శ్లోకములోని మాటలును, సనత్కుమార సంహితాంతర్గత [1]శివతత్వసుధానిధియందలి శివనామస్మరణాధ్యాయమందున్న

“హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ
శివ శంకర సర్వాత్మ న్నీలకంఠ నమోస్తు తే”

యను శ్లోకమును గూడ శ్రీనాథుడు (V-21) సంస్కృతరగడలో వాడుకొన్నాడు.

భట్టబాణుని కాదంబరి నుండి శ్రీనాథుడు గ్రహించిన వర్ణనము లనేకము శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగా రుదాహరించి యున్నారు. శివరాత్రిమాహాత్మ్యము II-15, 17, 30, 96, 97, 98, III-21 గద్యపద్యములకు మూలములు కాదంబరిలో గలవు. పాత్రచిత్రణము, గుణశీలస్వభావముల వర్ణనములు కూడ కాదంబరి నుండి సంగ్రహింపబడినవి. ఇందలి కావ్యత్వము గూర్చి శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు విపులముగా వ్రాసియున్నారు.[2]

పూర్వముద్రణములు:

ఇంతకు పూర్వము శివరాత్రిమాహాత్మ్యము అసమగ్రముగా మూడుసారులు పుస్తకరూపమున కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తువారు ప్రకటించినారు.

  1. అనుముల రామనాథశాస్త్రి పరిష్కృతము, శ్రీ ముదిగొండ బుచ్చిలింగయ్యశాస్త్రిగారి పంచాక్షరీ ముద్రాక్షరశాలలో ముద్రితము, హైదరాబాదు- 1932.
  2. ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక, సంపుటము 40. సంచికలు 500, కాకినాడ.