Jump to content

పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సరవి నొనర్చు నీదు పరిచర్యలు మెచ్చినవాఁడ గాన ని
ప్పురి కరుదెంచి తెల్పితిఁ బ్రబోధవిధం బతిసూక్ష్మవైఖరిన్.

263


వ.

అని చెప్పి యాఋభుండు చనియె. నిదాఘుండును గురూపదేశవిశేషంబున
నద్వైతవాసనావాసితుండై సర్వభూతంబుల నభేదంబునం జూచి ముక్తుండయ్యె.
సౌవీరనాయక నీవును తుల్యాత్మరిపుబాంధవుండవై సర్వగతంబైన యాత్మ
జ్ఞానంబు భజియింపుము. నభం బొక్క టయ్యును సితాసితభేదంబుల భ్రాంత
దృష్టులకు భిన్నంబై తోఁచిన ట్లొక్కండైన యచ్యుతుండు భ్రాంతులకు నా
నారూపంబులై తోఁచునని చెప్పిన నారాజు పరమార్థదర్శనుండై భేదదృష్టిని
విడిచె. మైత్రేయ! ఆబ్రాహ్మణుండు జాతిస్మరణాప్తబోధుండై యాజన్మం
బున నపవర్గంబు నొందె.

264


చ.

భరతనరేంద్రవృత్తము శుభస్థితిఁ జెప్పినఁ బ్రేమ విన్న న
ప్పురుషుల కాత్మమోహములు పుట్టవు నిర్మలబుద్ధి చెందు సం
సరణమునందు నున్నను బ్రసన్నత ముక్తి ఘటించు నంచు భా
స్వరవరకీర్తిశాలియగు శక్తికుమారఁ డానతిచ్చినన్.

265


చ.

జగదుపకారికారి నుతసత్యవచోనిగమామృతాంబుధి
ప్రగుణవిహారిహారి కకురప్రమదారుచమండలీగళ
న్మృగమదసారిసారి నిబిరీసభుజాపరిఖేల నావితా
భ్రగపరివారి వారిరుహ పత్రరుహాపరిభావిలోచనా.

266


క.

ప్రణమన్నిధానధానా, ర్పణమాప్తినిధానదానరాజద్గజర
క్షణగాన గానవిద్యా, చణ వేణ్వసమానమాన సకృతస్థానా.

267


భుజంగప్రయాతము.

మహానీలశైలేంద్ర మాణిక్యశృంగా
గ్రహర్మ్యాంతరావాసరంగన్మనోబ్జా
మహాలోకనాయాతమానుష్యకేష్టా
వహోరస్థలీనిత్యవాసీకృతాబ్జా.

268


గద్య.

ఇది శ్రీసుభద్రాకరుణాకటాక్షలబ్ధకవిత్వతత్వపవిత్ర వేంకటామాత్య
పుత్ర కంచాళ శ్రీరంగాచార్యకృపాపాత్ర సజ్జనమిత్ర శ్రీహరిగురుచరణారవింద
వందనపరాయణ కలిదిండి భావనారాయణప్రణీతంబైన నీవిష్ణువురా
ణంబునందుఁ బ్రియవ్రతునిచరిత్రంబును, అతండు నిజపుత్రులకు సప్త