పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నే నిట్టివాఁడ నని భూ, మీనాయక చెప్పఁదరమె మీ రనుశబ్దం
బే ననుచు నాత్మఁ బలుకుట, యై నెగడుంగాదె యనుచు నమ్ముని పలికెన్.

225


గీ.

అవనినాథ యనాత్మయం దాత్మబుద్ధి, నాచరించి యనాత్మోక్తమైన శబ్ద
మాత్మభవమంచుఁ బల్కుదురహహ నిజము, తెలియ నాత్మకు శబ్దంబు గలదె చెపుమ.

226


క.

నాలుక దంతోష్టంబులు, తాలువులును నిఖిలశబ్దతతిఁ బుట్టింపన్
జాలినహేతువు లి ట్లీ, కీ లెఱుఁగరు శబ్దమాత్మకృతమే తలఁపన్.

227


గీ.

ఇన్నియును శబ్దజననైకహేతువులుగ, నొక్కవాక్కె యనుచు బల్కు నోనృపాల
యెన్నివిధములనైన ని ట్లెంచిచూడ, బలిసి తీ వనుమాటలు పలుకఁజనదు.

228


క.

తలయును చేతులు మొదలుగఁ, గల యంగప్రతతి తనకుఁ గలుగుశరీరం
బల యాత్మకన్న వేఱని, తలఁచిన నేపేరఁ బిలువఁదగు నయ్యాత్మన్.

229


గీ.

పరుఁడు నాకన్న నొకఁడున్న భంగియైన, నితఁడొకఁడు నేనొకం డనుమతము కలుగు
భూతతతులందు నొక్కండ పురుషుఁ డుండు, కాన నీ వెవ్వఁ డనఁ జెప్పఁగా వశంబె.

230


క.

నీపల్లకి యిది నీవున్, భూపతి వేమెల్ల మోచుపురుషుల మిది నీ
ప్రాపుగలలోకమని యో, భూపాలక తలఁచుటెల్ల పోలదుసుమ్మీ.

231


గీ.

ధరణివర వృక్షమునఁ గల్గి దారు వందు, శిబిక యనఁ గల్గె శిల్పవైచిత్రిచేత
సరగ దీనికి వృక్షసంజ్ఞయును దారు, సంజ్ఞయును నింతిలో నెందు చనియెఁ జెపుమ.

232


క.

నిను వృక్షసమారూఢుం, డని కానీ దారురూఢుఁ డని కానీ,యో
జనమనదు శిబిక యనఁ గా, దన నేటికి దారుసంగ్రహము కాదేమో.

233


క.

విను ఛత్రశలాకాదుల, కనయము భేదంబు సిద్ధమైన నెచటికిన్
జనె ఛత్ర మనెడున్యాయము, చనునా నీయందు బుద్ధి చక్కం గనినన్.

234


చ.

పురుషుడు కాంత గోవ్రజము భోగి విహంగమ ఘోటకంబు కుం
జర మనుసంజ్ఞ లెల్లను రసాజనవల్లభ కర్మహేతులో
కరచితసంజ్ఞ లెన్నికొనఁగా సురమర్త్యపశుద్రుమాదు లె
ల్లరసిన నాత్మ గాంచు వపురాశ్రితసంజ్ఞలు కర్మకృత్యముల్.

235


గీ.

అధిప రాజని భటుఁడని యన్యమైన, వస్తువని యంట తెలియనివార్తసువ్వె
సునిశితప్రజ్ఞ నరసిచూచిన ని వన్ని, నాటకంబులు సంకల్పనామయములు.

236


క.

జనకుండవు తనయుకునం, దనుఁడవు తండ్రికి సపత్నునకు రిపుఁడవు మ
న్నన పత్నికిఁ బతి విట్లగు, నిను నెవ్వ రనంగవలయు నృపవర చెపుమా.

237