పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పంచచామరము.

కొలందిగా ధ్రువుండు మేరుకూటలగ్నకాలచ
క్రలాలితాక్షరూఢుఁడై వికాస మొప్పఁ ద్రిమ్మరున్
కులాలచక్రనాభియందుఁ గూర్చినట్టి మంటిము
ద్దలాగునన్ నిరంతరంబు తత్స్థలంబునం దగున్.

120


వ.

అయనద్వయంబునందును మార్తాండుండు శీఘ్రమందగతుల నడచుకతంబున
నహోరాత్రు లల్పంబులును, నధికంబులును నై నడచు.

121


సీ.

పంకజగర్భుశాపంబునఁ బ్రత్యహం, బును మృతిఁబొందుచుఁ బుట్టుచున్న
నిరుపమోద్ధతులు మందేహాభిధానరా, క్షసులు సంధ్యల వచ్చి సవితుఁ బట్టి
మ్రింగ నూహింతురు మేదినీసురులు సం, ధ్యోపాస్తి సేయుచు నుర్వి విడుచు
మేదురప్రణవసమేతగాయత్ర్యభి, మంత్రితార్ఘ్యాంబువుల్ మహితవజ్ర


గీ.

ధారలై తాకి దైత్యులతలలు ద్రుంచు, మగుడి సంధ్యలఁ బుట్టి యిమ్మాడి జత్తు
రాతతాయులు వారు నిత్యంబు నిట్ల, అహిమభానునినడక బ్రాహ్మణవరేణ్య.

122


ఉ.

ఆదిని వహ్ని నిండె ప్రధమాహుతిచేఁ బరితుష్టి నొందు ఛా
యాదయితుండు దాన దివిజారు లడంగుదు రట్లు కానఁ బ
ద్మోదరమూర్తిభానుఁ గరుణోదధి సంధ్యలఁ గొల్వఁగా దగున్
కాదని కొల్వఁ డెవ్వఁడు వికర్తన హంతయతండ ధారుణిన్.

123


వ.

ఇట్లు మందేహుల జయించి.

124


గీ.

లోకరక్షణపరులు సుశ్లోకు లధిక, తరతపోధను లత్యంతధర్మపరులు
కీర్తనీయులునగు వాలఖిల్యముఖ్య, భూసురులరక్షఁ దెలివొంది పోవు నినుఁడు.

125


వ.

నిమేషకాష్టకళాముహూర్తపరిమాణంబులు నీకుం జెప్పితిం గదా. అట్టి
ముహూర్తంబులు ముప్పది యహోరాత్రంబు. సూర్యరేఖోదయంబు
మొదలుకొని మూడేసిముహూర్తంబులు ప్రాత, స్సంగవ, మధ్యాహ్న,
పరాహ్ణ, సాయాహ్నసంజ్ఞలం బరఁగు. ఇప్పదేనుముహూర్తంబులు దివం
బగు అంతియె రాత్రియగు. ఉత్తరాయణ, దక్షిణాయంబుల నహోరాత్రం
బులు వృద్ధిక్షయంబులం బొందు.

126


గీ.

మేషతులలయందు మిహిరుండు వసియింప, సమము రేయిఁబగలు విమలచరిత
అగును దక్షిణోత్తరాయణంబులు కర్కి, మకరముల నినుండు మహిమ నుండ.

127


వ.

పదేనహోరాత్రంబులు పక్షంబు, పక్షద్వయంబు మాసంబు. మాసద్వ
యంబు ఋతువు, ఋత త్రయం బయనంబు. ఆయనద్వయంబు సంవత్సరం
బగు, వినుము.

128