పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఘోరపాతకనీరసారణ్యపటలంబు గాల్సంగ నేవేల్పు గారుచిచ్చు
యామినీచరపిశాచాచలవ్రాతంబుఁ బొడిసేయ నేవేల్పు పిడుగుతునుక
భవజరామరణకార్పాసకదంబంబుఁ దూలింప నేవేల్పు రోలుగాలి
భయరోగదుఃఖవిపద్విహంగశ్రేణిఁ, దవుల నేవేల్పు సాళువముకూన
తనపదాంభోరుహములు తత్పరతఁ గొలువఁ, గడఁగువారికి నేవేల్పు కల్పవృక్ష
మట్టివేల్పు గదాధరు నాశ్రయింతు ననిన సాక్షాత్కరించి నారాయణుండు.

105


మ.

జనలోకస్తుత నిన్ను మెచ్చితి నభీష్టం బిచ్చెద న్వేఁడు నా
విని సంతోషముతోడ రైభ్యుఁడు శిరోవిన్యస్తహస్తాబ్జుఁ డై
సనకాదు ల్వసియించులోకము కృపాసంపన్నత న్నాకు ని
మ్మని ప్రార్ధించిన నిచ్చి మాధవుఁ డదృశ్యం బైన నారైభ్యుఁడున్.

106


గీ.

శౌరివరమున నొకనిమేషంబులోన, తత్త్వవిజ్ఞానఘంటాపథంబువెంట
నరిగెఁ గైవల్యకోకిలోద్యానమునకు, సనకముఖ్యమహామునిస్థానమునకు.

107


క.

అని చెప్పిన విని ధాత్రీ, వనిత వసుక్షోణిపాలువలనం బ్రభవిం
చి నిషాదాకారము దా, ల్చినపురుషుం డేమి చేసె లీలాదఁంష్ట్రీ.

108


సీ.

అనవుడు దేవుఁ డిట్లని చెప్పె నా చెంచు మిథిలాపురీబహిర్మేదినీస్థ
లంబున నుండి కుటుంబసంరక్షణార్థంబు గానకుఁ బోయి ప్రతిదినంబు
నొకమృగంబు వధించి హుతవహతిథులకు సగము సమర్పించి సగము విక్ర
యించి సంసారప్రపంచంబు నడుపుచుఁ బర్వపర్వంబునఁ బైతృకంబు
తనకులాచారధర్మంబు దప్పనీక, సలుప నీభంగిఁ బెక్కువర్షములు చనియె
నంత వానికి నర్జునకాఖ్యు డైన, సుతుఁడు జనియించె నియతుండు సుగుణయుతుఁడు.

109


గీ.

వ్యాధభర్తకు మఱికొన్ని వర్షములకుఁ, బుట్టె నర్జునకీనామపుత్రి మెఱుఁగుఁ
దీఁగెకైవడి రతిరాజుతియ్యవింటి, చేగపోలిక వెన్నెలసోగపగిది.

110


క.

ఈచందంబున జననం, బై చాంద్రమసకళభంగి ననుదినవృద్ధి
శ్రీచాతురి గలచెంచుల, రాచూలికి యౌవనంబు రాఁగడఁగుటయున్.

111


సీ.

నాభికావాలమండలమున మొలచినతాపింఛవల్లీమతల్లి యనఁగఁ
దనుమనోభవపుష్పధనురంతరంబునఁ గట్టినబంగారుకట్టు లనఁగ
సౌందర్యకేళికాసారంబులోపల మొనసిననెత్తమ్మిమొగడ లనఁగ
నిటలస్తనంధయనీహరకరునిపైఁ గవిసినగాఢాంధకార మనఁగ
నాఁడునాఁటికి నారు గానంగఁబడియె, వళులు దోఁచెఁ గుచంబులు వచ్చెఁ గురులు
వ్రాలె నంతట నాభిల్లవంశవల్ల, భాత్మసంభవ సంపూర్ణయౌవనమున.

112