పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

యతిజనసేవ్యమాన మహిమాంబునిధాన సనత్కుమార సం
తతనియమప్రచార కృప నన్నుఁ గృతార్ధుఁడవంచు నాన తి
చ్చితి రెటుగాఁ గృతార్థుఁడ రచించితినో జపముల్ తపంబులుం
గ్రతువులు గాక మీరు బలెఁ గాంచితినో పరతత్త్వబోధమున్.

88


సీ.

 నావుడు బ్రహ్మమానసకుమారుండు సనత్కుమారుండు సన్మార్గనిరత
వినుము గయాక్షేత్రమున నెవ్వరికి నొక్కనాఁడు పిండప్రదానంబు సేయ
నబ్బదు నిచ్చలు నట్టియాగయ నీకు నబ్బెఁ బిండప్రదానాగ్నిహోత్ర
జపతపంబులఁ బితృసంతృప్తి గావింప సాక్షాద్గదాపాణి శౌరిఁ గొలువ
విమలవీచీఘటాఘుమఘుమనినాద, బధిరితాఖిలదిక్చక్రఫల్గునీన
దీపవిత్రోదకంబులఁ దీర్థమాడ, నింతకంటెఁ గృతార్థత్వ మెద్ది చెపుమ.

89


ఉ.

అద్భుత మింక నొక్కయితిహాసము చెప్పెద మున్ను దోఃప్రతా
పోద్భటుఁడై విశాలపురినుండి విశాలనరేశ్వరుండు పు
త్రోద్భవకౌతుకానుభవ మొక్కటి లేమికి వేఁగి వాక్యసం
పద్భుజగేంద్రసన్నిభుల బ్రాహ్మణులం బిలిపించి వారితోన్.

90


ఉ.

ఓసరసీరుహాసనకులోద్భవులార సుతాభిలాష నేఁ
జేసితి యాగము ల్విపినసీమల ఘోరతపంబు చేసితిన్
జేసితిఁ గన్యకాకనకసింధురధేనురథాశ్వదానముల్
చేసిన నామనోరథము చెందదు కారణ మేమి చెప్పుఁడా.

91


మ.

అనినన్ సంపద లెన్ని గల్గిన నరేశా యింద్రసంకాశనం
దనుఁ డొక్కండును లేమి నీనగరు చిన్నంబోయె వేయేల వే
చని భక్తిం బితృకోటి నెల్ల గయలోనం దృప్తి పొందింపు నం
దనుఁ డంభోనిధివేష్టితాఖిలధరాధౌరేయుఁడై పుట్టెడున్.

92


క.

అని చెప్పి సజ్జనానం, దను నందనుఁ గను మటంచుఁ దనమకుటతటం
బున నక్షత లిడి దీవిం, చి నివాసములకు విప్రసింహులు చనినన్.

93


క.

క్షణమాత్రము నిలువక వా, రణరథహయభటులు వెంట రా భేరి ధణం
ధణ మనఁగ నమోఘబ్రా, హ్మణశిష యనుచును విశాలుఁ డరిగెన్ గయకున్.

94


చ.

అరిగి కనత్తరంగశిశిరానిలవల్గనఫల్గునీతటాం
తరమున సైన్యము ల్విడియఁ దా గయలోఁ బితృతర్పణైకత
త్పరమతి పిండదానము యథావిధిఁ జేయుచునుండి చూచె ము
వ్వుర సితరక్తకృష్ణతనువుల్ గలవారల నంబరంబునన్.

95