పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రియుఁడున్ వారల ధూమవర్ణములవారిం దిర్యగూర్ధ్వాస్యులన్
వియదధ్వాభిముఖప్రయాణపరులన్ వీక్షించి లేనవ్వుతోన్.

42


గీ.

ఓతపసులార మీలోన నూర్ధ్వవదను, లైనవారలు నాందిముఖాఖ్య మెలఁగుఁ
డగుఁడు పితృదేవతలు తిర్యగాస్యులైన, వారలు గృహస్థులకుఁ దరువాయి వినుఁడు.

43


వ.

మీమార్గంబు దక్షిణాయనంబు మీదివసం బమావాస్య తద్దివసంబున నుపవసించి
కుశవేధ చేసి కుశతిలోదకతర్పణంబుల మీకు సంతృప్తి గావించుపుణ్యాత్ములకు
వరంబు లిండని చతుర్ముఖుండు నియమించె విశ్వంభరాతలేశ్వరా యింక సోమో
త్పత్తి వినుము.

44


సీ.

నలువమానసపుత్రునకు నత్రిమునికి నందనుఁ డైనసోముండు దక్షసుతల
నిరువదియేడ్వుర వరియించి వారిలోఁ గుసుమసాయకరత్నగోపురాధి
రోహిణి రోహిణి రూపరేఖావిశేషంబున హెచ్చ నచ్చామమీఁది
వలపులు దల కెక్కి కల నైనఁ దమవంకఁ గడకంటఁ జూడమి కడమసతులు
విరహసంతాపభరమున వేఁగి వేఁగి, పుట్టినింటికి నొకనాఁడు పోయి లోచ
నాంబుధారలఁ దండ్రిపాదాంబుజములు, గడిగి పలికిరి కంఠగద్గదికతోడ.

45


చ.

అనవరతంబుఁ గోకతిమిరాంబురుహంబులు పూర్వజన్మవా
సనలఁ దుషారధామకరసంగతికల్మికి నొచ్చుఁ గాని మా
ఘనకుచచక్రముల్ కబరికాతమముల్ వదనారవిందముల్
జనక తుషారధామకరసంగతి లేమికి నొచ్చుఁ జూడుమా.

46


గీ.

ఆలి నొల్లనివాఁడు దా నీలకూర, కుప్పు చాల లే దన్నట్లు తప్పు లేని
తప్పు గొట్టించు మమ్ము సంతతము నేమి, చెప్పుకొందుము నీతోడ సిగ్గుపడక.

47


సీ.

నీహారసలిలంబు నించి కాంచనకలశముల మజ్జన మార్పఁ జనవు లేదు
పచ్చలకూటంబుపైఁ బళ్ళెరంబు పెట్టినవేళ వడ్డింపఁ జనవు లేదు
కప్రంపుఁబలుకుబాగాల నర్పించి నేర్పున నాకు చుట్టి యీఁ జనవు లేదు
పర్యంకతలమునఁ బవ్వళించినఁ జేరి చరణాంబుజము లొత్తఁ జనవులేదు
మాకు నెన్నండు నత్రికుమారు దక్క, నేలుకొన్న గయాళిరోహిణికిఁ దక్క
పాప మెటువంటిదో కాక భాగ్యవంతుఁ, డైనపెనిమిటి గలిగియు లేనిఫలము.

48


క.

అని విన్నపంబు చేసిన, తనయల నూరార్చి వచ్చి దక్షుఁడు తాఁ జె
ప్పినబుద్ధి విననిశశిపైఁ, గినిసి కనుంగొనలు దోరగిల నిర్దయుఁడై.

49


క.

ఖలవృత్తి మత్తనూజల, నొలపక్షము చేసి వరుస లొసఁగక శోకా
కులితలఁగాఁ జేసినచం,చలచిత్తుఁడ చెడు మటంచు శపియించుటయున్.

50