పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

గుఱుతు దప్పనిభూరిగోత్రధర్మముఁ బూని నిరుపమరాజశేఖరత నలరి
వినుతపాండుఁవర్ణమునఁ బ్రకాశత మీఱి బుధరక్షణోపాయబుద్ధిఁ జెలఁగి
వలనుమీఱ ననంతవాహినీయుక్తుఁడై భువనాభిరామవిభూతిఁ బొదలి
సంతతాహీనభూషణభూషితాంగుఁడై ప్రియకుమారగణాభ్యుదయ మెలర్పఁ


తే.

జారువృషకేతుమహితుఁడై స్మరవిరోధి, కరణి ధరణిఁ జెలంగువేడ్క లన శేష
జనమనోరథసంధానచతురుఁ డగుచు, వాసికెక్కినయానృపాగ్రేసరుండు.

58


సీ.

తనచంద్రహాసనితాంతవైఖరి మిత్రశత్రులఁ జిరసుఖాస్పదులఁ జేయఁ
దనమహాద్రవిణవిస్తారంబు బుధవీరవరులను నిత్యసవనులఁ జేయఁ
దనకమలాకరధామంబు హంసార్థితతుల మానసవిచింతనలఁ జేయఁ
దనదానధారావితతగోసమితి విప్రప్రార్థులఁ బూర్ణజీవనులఁ జేయ


తే.

నుండునుద్దామభుజదండమండనప్ర, చండకోదండపాండిత్యఖండితోగ్ర
భండనోద్దండశౌండారిమండలేశ, మండలుం డామహీస్థలాఖండలుండు.

59


గీ.

అతనిపూఁబోణి యొప్పు మత్తాలివేణి, సైకతశ్రోణి వికసితజలజపాణి
పనమకళ్యాణి నిజనేత్రనిరసితైణి, సతతవితతగుణశ్రేణి సత్యవాణి.

60


చ.

పలుమఱు జాహ్నవిం బరమపావని యందురు గాక యింతయు
నిలుకడలేక పంకముల నిండుకయుండి విషస్వరూపయై
కలఁగుచు వక్రపద్ధతులఁ గాంతునిశీర్ష ముఁ ద్రొక్కి నిల్చుఁ దాఁ
దుల యగు టెట్టు లవ్వికచతోయరుహాయతచారునేత్రకున్.

61


సీ.

నిరతపాతివ్రత్యగరిమ నరుంధతి నసమసంపద్వృద్ధి నబ్ధికన్య
నవిరళవాక్యవైభవమున భారతి నిష్టభోగనిరూఢి నింద్రురాణి
నధికక్షమాలీల నవనీవధూటిని విమలసౌంద్యసారమున రతిని
బరమపావనత నంబరచరద్వాహిని నురుతురైశ్వర్యవిస్ఫురణ నుమను


తే.

బోలు నితరులు తులయనఁ బొసఁగు టెట్టు, లనుచు జను లెల్లఁ దను సముదగ్రసరణిఁ
బ్రస్తుతులు సేయ నభిన్నప్రాభవమునఁ, జెలఁగు నప్పూర్ణతారేశలలితవదన.

62


తే.

ఆసరోజాక్షి క్రమమున నధిపువలన, రుక్మియును రుక్మరథుఁడును రుక్మబాహు
రుక్మకేశులు రుక్మనేత్రుఁడు ననంగఁ, బరఁగుతనయుస నేవురఁ బడసి మఱియు.

63


క.

సిరుల జవరాలియంశము, తిరమై తనకుక్షియందు దీపింపఁగ భా
సురలీల నమరి యాహిమ, కరముఖి యాఱవది యైనగర్భముఁ దాల్చెన్.

64


క.

నునుఁజెక్కులు దెలుపారెం, జనుముక్కులు నలుపువాఱె సమమగుచు వళుల్
పెనుస్రుక్కులు వడిఁ దీఱెం, గనుచొక్కులు మీఱె నంతఁ గంజేక్షణకున్.

65


తే.

కాంతగర్భాంతరంబునఁ గమలవేడ్క, నొయ్యనొయ్యనఁ బెరుగుచు నుంటఁజేసి
మధ్యమున కెప్పుడునుజోక మట్టుమీఱఁ, బేదఱికమంతయును దీఱి పెంపుదనరె.

66