పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

క.

అనుపమగుణుఁ డగుసూతుఁడు, మునుకొని మును శౌనకాదిమునులకు వినయం
బున భాగవతపురాణము, ఘనభక్తిఁ బ్రవిస్తరంబుగా నెఱిఁగించెన్.

33


గీ.

అవ్విధంబు పరీక్షిజ్జనాధిపునకు, ఘనుఁడు శుకయోగి దెల్పుచోఁ గౌతుకంబు
పల్లవింపంగ రుక్మిణీపరిణయప్ర, కార మెఱిఁగింపుఁ డని రాజు గోరుటయును.

34


క.

ధీవరుఁ డాశుకుఁడు జగ, త్పావన మగుతత్కథావిధం బెఱిఁగింతున్
గేవలభక్తి చెలంగ మహీవల్లభ విను మటంచు నిట్లని పలికెన్.

35


సీ.

శ్రీకారణాభ్యున్నతాకారసన్మణిప్రాకారసౌధవ్రజాకరంబు
సోపానవవజ్రగోపానసీచిత్రరూపానవద్యోరుగోపురంబు
గంభీరహితవినకుంభీరయుక్తాంబుగంభీరపరిఖావిజృంభణంబు
లీలావరోధేందుశాలావకీర్ణేంద్ర నీలావళీకుడ్యజాలకంబు


తే.

లసదసమసమసుమశరవ్యసనవసుని, వసనసంత్యక్తరత్నసారసనవసన
రసికయోషానుమోదకశ్వసనశిశువి, సరవిశాలంబు కుండినపురవరంబు.

36


మ.

మహి నవ్వీడు చెలంగు నిందుమణిహర్మ్యస్థాంగనాచారువి
గ్రహవిద్యుత్కచనీలవారిధరవిభ్రాంతిస్వచేతోముహు
ర్ముహురుద్భాసితవారియంత్రపతితాంభోబిందుసందోహసం
గ్రహణోదంచితిచాతకప్రకరమై రంగత్ప్రకాశోన్నతిన్.

37


చ.

అలరఁగ సంచరించుతురగావలివీచులు తూర్యఘోషముల్
సలలితభామినీరదనసారసముల్ ఘనరాజహంసముల్
చెలఁగుపదాఱువన్నియపసిండిమెఱుంగుటరుంగుదిన్నెలున్
గలిగి పురంబు భాసిలు జగద్వినుతామరగంగయో యనన్.

38


ఉ.

అన్నగరంపుఁగుందనపుహర్మ్యతలంబుల నాడుబాలికల్
పున్నమరేలుచందురునిఁ బొల్సుగఁ గన్గొని యాటవేడుకం
జెన్నుగ నెన్నొస ళ్లెదురుసేయుచు దీకొని తాఁక నుర్విపై
నెన్నఁ గళంకి యయ్యె శశి యింతులకస్తురిబొట్టు లంటుటన్.

39


ఉ.

ఆపురగోపురాగ్రసముదంచితకాంచనకుంభముల్ మహో
ద్దీపితలీలలన్ మెఱయుధీరత్ నందుల సుందరీజనం
బే పలరుం బయోధరము లీపగిదిం దమ కంచు నిర్జరేం
దూపమచారువక్త్రలకు నొయ్యనఁ జూపఁగ నిల్పిరో యనన్.

40


గీ.

వజ్రముక్తాబ్జరాగప్రవాళనీల, వితతిచే నొప్పుఁ బురిపణ్యవీథి పుండ
రీకకుముదాబ్జహల్లకాస్తోకనీల, కువలయశ్రేణిచే నొప్పుకొలనువోలె.

41