పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

కలకలనాదము ల్సెలఁగఁ గంసవిరోధికథాప్రబంధముల్
పలికెడునూత్నరత్నమయపంజరసంశ్రితకీరశారికా
వలులవినోదవైఖరి యవారితకౌతుకహేతుభూతమై
యలరఁగ నద్ధరామరకులాంబుధిచంద్రుఁడు కోరి చూచుచున్.

55


తే.

పఱపుగలవట్టివేళ్ళచప్పరము లొరసి, మేటిపన్నీటివాఁగులు మించి మంచి
కపురపుటనంటిబోదెలఁ గలయవలచు, చలువచెంగల్వకేదారములును గడచి.

56


సీ.

అభినవపద్మరాగాశ్మకవాటముల్ చారుహరిన్మణిద్వారములును
బటుపుష్యరాగసంఘటితార్గళంబులు లాలితహరినీలజాలకములు
భూరిశోభాపూరహీరసోపానముల్ విపులచంద్రోపలవేదికలును
రుచిరగోమేధికప్రచురవలీకముల్ వికసితవైదూర్యవలభికలును


తే.

సాంద్రముక్తాఫలామలచ్ఛాదనములు, పృథులజాంబూననాబద్ధభిత్తికలును
గలిగి దేదీప్యమానమై వెలుఁగుచున్న, భవ్యతరచంద్రశాలికాభ్యంతరమున.

57


చ.

అపరిమితప్రసూననిఖిలాగరుజాపకసౌరభంబులుం
గపురపుధూపవాసనలుఁ గస్తురిగందములున్ జవాదిని
ద్దపువలపుల్ బుగుల్ కొనెడుదట్టపుదట్టుపునుంగుఁదావులున్
విపులగతిం దిగీశులకు విందు లనింద్యముగా నొనర్పఁగన్.

58


సీ.

సైకపుజరబాజుచందువా నొదవిన మేలిముత్యాలజాలీలు వ్రేల
గొనబైనబంగారుగోడల నంటిన నిలువుటద్దంపుగుంపులు వెలుంగ
బలుమానికపుఁగంబములఁ గదియించిన కాంచనపాంచాలికలు నటింపఁ
దెలిముత్రియంపుఁబందిరు లమర్చిన మంచిగందపుఁబట్టెకంకటులు మెఱయఁ


,ే.

బరిమళద్రవ్యములు నించి వరుస నిడిన, చంద్రకాంతపుగిండులు జానుమీఱ
నడపములు జాలవల్లిక లాదియైన, విమలశృంగారవస్తుజాలములు నమర.

59


తే.

కొలఁది మీఱినచిత్రలీలలఁ జెలంగి, యనుపమం బగునిద్దపుటఱ్ఱలోనఁ
బసిఁడిగొలుసులపసల నిం పెసఁగుచున్న, మానికపుఁదూఁగుటుయ్యాలపైని గదిసి.

60


సీ.

కనకకంకణఝణత్కారం బలర నొక్కమదహంసయాన చామరము విసర
మణిమయముద్రికాఘృణులు పర్వఁగ నొక్కమానిని తెలియాకుమడుపు లొసఁగ
నురుపయోధరకుంభయుగళి యుబ్బఁగ నొక్కపణఁతుక రత్నవిపంచి మీటఁ
జరణమంజీరనిస్వనము లొప్పఁగ నొక్కసరసిజేక్షణ బరాబరు లొనర్పఁ


తే.

గంబుకంఠి యొకర్తు గానంబు సేయ, భామ యొక్కతె బలుదమ్మపడిగఁ బూనఁ
జంపకామోద యోర్తు నిద్దంపుఁజికిలి, నిలువుటద్దంబు ముందర నిలిపి చూప.

61


తే.

తరుణు లిరువురు భోజసుతాస్వరూప, లిఖితనవచిత్రఫలకముల్ వేడ్కఁ బూని
యిరుగడల నిల్చి కొలుని నహీనవిభవ, జితపురందరుఁ డనఁదగి యతులగతిని.

62