పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

తన కెన యైనబాలకులఁ దార్చుక మెల్లనె గొల్లయిండ్లకుం
జని పెనువెన్నముద్దలు మెసంగుచుఁ జొంగుచు జున్ను మీఁగడల్
దినుచు విశుద్ధదుగ్ధపరిదిగ్ధకళేబరుఁ డై వెలుంగువె
న్నుని నవమోహనాకృతి మనోరథసిద్ధి యొనర్చుఁ గావుతన్.

136


ఉ.

వల్లవపల్లవాధర లవారితమోహనిబద్దబుద్ధిఁ ద
న్వల్లభుఁ గాఁగఁ గోరుచు భవానికిఁ బూజ లొసంగి నీటిలోఁ
బెల్లుగఁ జల్లులాడ దరిఁ బెట్టినవల్వలు మ్రుచ్చిలించి సి
గ్గెల్లను గొల్లలాడినరతీశగురున్ మదిఁ బాదుకొల్పెదన్.

137


క.

బుద్దు లెఱుంగక తిరిగెడు, గద్దరి యని తల్లి ఱోలఁ గట్టినఁ గినుకన్
మద్దులఁ దద్దయుఁ గూల్చిన, ముద్దులగోపాలబాలమూర్తిఁ దలంతున్.

138


చ.

పదముల నందియల్ మొరయ బ ల్జిగి బంగరురావిరేక నె
న్నుదుట నటింప మేలిమొలనూలున గంటలు గల్లనంగ నం
గదములు రత్న హారములు కంకణముల్ మణికుండలంబులున్
బొదలఁగ గొల్లగీములను బూని చరించువిభున్ భజించెదన్.

139


తే.

అని తలఁచుచుండె నని సూతుఁ డఖిలమౌను, లకు నెఱింగించినట్టు లాశుకుఁడు భరత
కులవరేణ్యున కెఱిఁగింప నెలమి నలరి, యవలికథయెల్ల వినఁగోరి యడుగుటయును.

140


చ.

దురితలతాలవిత్ర శశితోయజమిత్ర కృశానునేత్ర సుం
దరతరగాత్ర సంతతబుధస్తుతిపాత్ర తుషారభూమిభృ
ద్వరతనయాకళత్ర, నిజదాసజనావనసూత్ర యక్షకి
న్నరనరసిద్ధసాధ్యసురనందితచిత్రచరిత్రవైభవా.

141


పంచచామరము.

హరా ధరామరాదరా మురాసురాహితస్ఫుర
చ్ఛరా పరాత్పరా ధరాత్మజామనోహరా వరా
బరాంబరా కిరాతరూపభాసురా సురాసురా
కరాజిరా మరాళరాజకాంతకాంతవిగ్రహా.

142


మాలినీ.

పురదనుజవిభంగా భూషితోద్యద్భుజంగా
సురుచిరధవళాంగా సూరిచేతోబ్జభృంగా
కరకమలకురంగా కాంతగంగోత్తమాంగా
తరణిశశిరథాంగా దైవవేశ్యాభుజంగా.

143


గద్య.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌండి
న్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తిమ్మన
నామధేయప్రణీతం బైన రుక్మిణీపరిణయం బనుశృంగారప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము.