పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నెమ్మి యగుపెండ్లిలగ్నంబు నిర్ణయించి, కమ్మ వ్రాయించి యాభీష్మకక్షితీశు
భటునితోఁ గూర్చి మఱితమభటుని నొకని, నొనరఁ గుండిననగరికిఁ బనుపుటయును.

20


క.

ఆభటు లిరువురు బలజి, ద్వైభవుఁ డగుగుండినేంద్రు దర్శించి వెసన్
శోభనపత్రిక యొసఁగఁ జి, రాభినవానందమందహాసాననుఁ డై.

21


క.

మణికల్యాణాంచితభూ, షణము లనేకంబుగా నోసంగి నృపగ్రా
మణి కల్యాణాంచితభా, షణములఁ జేదీశభటుని సంతసపఱిచెన్.

22


ఉ.

అంతట వాని వీడ్కొలిపి యాప్తుల బాంధనకోటులన్ మహీ
కాంతులఁ బిల్వఁబంచి శుభకారణవస్తువులెల్లఁ గూర్చి వీ
డంతయు వింతమీఱఁగ రయంబ యలంకృతి సేయుఁ డంచు న
త్యంతకుతూహలం బలక నాజ్ఞ యొసంగినఁ బౌరు లందఱున్.

23


ఉ.

గోడల నెల్లఁ జిత్తరువు గూరిచి నిద్దపుఁజందమామరా
మేడ లలంకరించి జిగి మీఱఁగఁ బల్లవహల్లకంబులం
గూడినరత్నతోరణపుఁగోటు అమర్చి బహిర్విహారపుం
జాడల వీథివీథులను జల్లిరి సారపటీరనీరముల్.

24


క.

నిగనిగజిగిఁ బొగడఁగఁ దగు, పగడపుఁగంబములు నించి పఱపు దలిర్పం
సొగసుగ ముత్తెపుఁబందిరు, లగణితముగ నిల్పి రప్పు డాకస మొరయన్.

25


ఉ.

రంగుగ మేలిబంగరుమెఱంగుటరంగుల నంగనామణుల్
పొంగుచు రంగవల్లికలు ప్రోడతనంబుల వ్రాసి వాసి మీ
ఱంగ మృగీమదంబుఁ గపురంబును సాంకవమున్ మెదించి యు
త్తుంగకపోతపాలికల దోర దర్పఁగ మెత్తి రత్తఱిన్.

26


తే.

పురములోపల రత్నగోపురము లెల్లఁ, గరము మెఱయ నలంకృతి నెఱి నొనర్చి
భూరిశోభాసమేతప్రభూతశాత, కుంభకుంభంబు లామీఁదఁ గుదురుపఱిచి.

27


క.

నగరులలోపలఁ గపురము, నగరులదూపములుఁ బెట్టి యతిశయగతి న
న్నగరిపునగరికి సరియె, న్నఁగ నగణితలీలఁ జెలు వొనర్చిరి వరుసన్.

28


వ.

అప్పు డప్పురవరంబు మరకతమణికృతవితతవిభావిభాసితోన్నతజాకలజాలకాంతర్ని
ష్క్రాంతాగరుధూపధూమశ్యామాభ్రభ్రమామితకామితలీలాఖేలనలోలశాలానీల
కంఠానీకంబును, బ్రతినికేతనకేతననూతనవితానశతానర్ఘ్యమణినికాయకాయమాన
విరాజమానంబును, నవరత్నకీలితలాలితశోభాసమానభాసమానానూనమానవేశనివేశ
ద్వారాపారప్రమోదపూరణకారణతోరణావలంబబింబఫలశంకాంకురకరామలకమ
లరాగోపలచాపలభావధావన్మహోత్సుకశుకనికరంబును, ఘనఘనసారసారసారంగ
మదామోదకహిమోదకధారావారాభిషిక్తసంసక్తముక్తాఫలచూర్ణకీర్ణనిరర్గళరాజ
మార్గంబును, సభాభవనభువనాద్భుతికరారచితరుచిరతరవ్యాజరాజీవరాజోన్ములనా