పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

మదిని మీమాటె పరమధర్మం బటంచు, నమ్మియుండినఁ గార్య మెంతయును జెడదె
పెద్ద లనియెడిగంపంతపేరె కాని, బుద్ధి ముదిమది దప్పినఁ గొద్దిగాదె.

127


ఉ.

గొల్లలయిండ్లఁ బా ల్పెరుగుఁ గొల్లలుగా సతతంబుఁ ద్రావి మ
త్తిల్లి యరణ్యదేశములఁ ద్రిమ్మరుక్రేపులకాపరిన్ గడున్
బల్లిదుఁ డంచు నెన్నెదరు నవ్వెడువారి నెఱుంగ కియ్యెడం
బెల్లుగ గొల్లబోయనికి బింకము బంటుఁదనంబు గల్గునే.

128


చ.

చివికినబండి ద్రొక్కుటయుఁ జెట్లు పెకల్చుట పా లొసంగుదా
నవి భువిఁ గూలద్రోయుట వనంబునఁ బామును గొంగ నెద్దు వా
రువమును గర్దభంబును విరోధు లటంచుఁ దలంచి చంపుటల్
శివశివ విక్రమంబు లని చెప్పఁగఁ జిత్రము లయ్యె నియ్యెడన్.

129


క.

మంచిది మీ పలు కిప్పుడు, వంచింపఁగ వలదు బాంధనమునకుఁ దగునే
క్రించుఁ డయి మేనమామం, ద్రుంచినఖలుఁ డెంతబలయుతుం డై యున్నన్.

130


చ.

సరిసరి విూవిచార మిఁకఁజాలు శిరీషసుమోపమానభా
సురసుకుమార యై సకలసూరిజనాభినుతోల్లసద్గుణా
కర యగురుక్మిణిం బసులకాపరి కియ్య మదిం దలంతురే
గురుతరరత్నహార మొకక్రోతి మెడం దవిలింపఁ జూతురే.

131


క.

మీ కిష్టం బని వరచా, మీకరనిభగాత్రి నెట్లు మీఁ దెఱుఁగక నేఁ
డాకఱిగొల్ల కొసఁగుదురు, కాకిమెడం దొండపండు గట్టినభంగిన్.

132


చ.

కటకట సర్వభూభరణకారణభూరిభుజాగ్రజాగ్రదు
త్కటపటుశింజినీనినదకార్ముకముక్తశరాహృతారిరా
డ్భటపటలుండు భీష్మకనృపాలుఁ డనం బ్రభ మీఱి యీతఁడే
కుటిలతనొంది గొల్లనికిఁ గూఁతు నొసంగిన నవ్వరే జనుల్.

133


క.

మావాక్యము గొఱ గాదని, తా వేఱొక టనుట పడుచుఁదన మిది యనుచున్
భావింపక దయఁ జూడుఁడు, వేవిధములఁ గేలు మొగిచి వేఁడెద మిమ్మున్.

134


తే.

ఘనుల కెల్లను దమడెందమునకు నిష్ట, మగు తెఱంగున నొనరింపఁదగును గార్య
‘మాత్మబుద్ధిస్సుఖంచైన' యనెడువచన, మరయ నిద్ధాత్రిపై నిశ్చయంబు గాదె.

135


క.

శశిముఖి యగురుక్మిణి న, ప్పశుపాలున కొసఁగ నొల్లఁ బదివే లైనన్
మశకీకృతపరబలుఁ డగు, శిశుపాలున కిపుడు పెండ్లి సేయుదుఁ బ్రీతిన్.

136


ఉ.

సంగరరంగరంగదరిసామజభీమజనప్రదీపితో
త్తుంగమృగేందుఁ డంగభవతుల్యమనోహరమూర్తి భూమిభృ
త్పుంగవవర్ణనీయపరిపూర్ణగుణాకరుఁ డిందుచంద్రికా
భంగయశోన్వితుండు శిశుపాలుఁడు చూడ నృపాలమాత్రుఁడే.

137