Jump to content

పుట:రసాభరణము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జనితము లీవ్రణంబులు ప్రచండపుటెండ చెమర్చుటల్ సతీ
ఘనముగ మోవి గందుట తగ న్విను శంఖరవం బొనర్పఁగాన్.


శరనాయకుని కుదాహరణము—


చ.

చెలియ యిదేలొకో చెవియుఁ జెక్కు నెఱుంగకయుండ నిన్నునోఁ
బలికెనె శౌరి యిట్లలుగఁ బాడియె నొచ్చిన నోరఁబల్కఁ డ
వ్విలసితమూర్తి నిన్ను నొకవేళ హితంబుగ నొయ్యఁబల్కుటల్
గలిగెనెయేని వెల్లవిరిగాఁ గలహించిన నాఁడరే యొరుల్.


క.

వరనాయకులకు నుచిత
స్మరలీల విటుండు పీఠమర్దనుఁడును నా
గరకుఁడు విదూషకుండును
నరయఁగ విశ్వాసు లగుసహాయులు ధరణిన్.


ఉ.

మంచితనంబున న్విభుఁడు మానుగ నాయకునంతవాఁడె యొ
క్కించుకవెల్తి నాయకు నహీనగుణంబులఁ బీఠ మర్ది దా
మించుగఁ గూర్ప విప్పఁగలమిత్రుఁడు నాగరకుండు లీల న
వ్వించు విదూషకుండు గడువేడుక నాయకనాయికాదులన్.


క.

నాయకుల సలలితాభి
ప్రాయంబునఁ దత్సహాయభంగులు దెల్లం
బైయలరు నాయికలను స
హాయుల నటఁ దెలియవలయు నది యెట్లనినన్.

నాయికాలక్షణము

క.

ధరణి స్వకీయ యనంగాఁ
బరకీయ యనంగ వెండి పణ్య యనంగాఁ
బరఁగుదురు మూఁడుతెఱఁగుల
వరసతియుఁ బరాంగనయును వారస్త్రీయున్.


చ.

పెనిమిటి కిష్టమైనపనిఁ బ్రీతినొనర్చు నొకప్పుడేని తాఁ
బెనిమిటిమీఁది మాటలును బెన్మిటియిష్టముగాని యాత్మలో
నునుపదు సాధ్వి, వెండి ప్రియమొందును జారిణి జారుఁ డబ్బినన్
మును ధనమెల్ల మ్రింగి పెడమోమిడుఁ బణ్యవిటుండు వచ్చినన్.


స్వకీయ కుదాహరణము—


ఉ.

ఏ నడపాడుచుండఁగ నుపేంద్రుఁడ నీమఱఁదల్ సుమీ నినుం
గాని వరింప నొల్ల దని గారవమొప్ప మదంబ పల్కు లే
లా నిజమౌనె యంచు నను లాలన చేసిన భావ మాత్మలో
నే నతఁ డున్నపానుపున కేగెడువేళఁ దలంతునే సఖీ.