పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

ఏకాదశస్కంధము


గీ.

ఆత్మ యను పేరఁ దనరుచున్నట్టి యనల
మందు నధ్యాత్మ యను నాజ్య మమర వేల్చి
జ్ఞానయజ్ఞంబు చేసిన జనుల కెల్ల
కలుగు మోక్షంబు నిక్క మీ కథ మునీంద్ర.

309


చ.

సమరములోన బాంధవుని జక్కగఁ జేసి యమాత్మజుండు చి
త్తమున విరక్తి కల్గి తాపము నొందుచు నన్ను మోక్షధ
ర్మములను భక్తితో నడుగఁ గ్రమ్మఱఁ జెప్పినయట్టి మోక్షధ
ర్మములను నీకుఁ జెప్పెద ధరామర వీనులు హర్షమందగన్.

310


క.

అజ్ఞాన ముడిగి కేవల
సుజ్ఞానము బొడముదాక సువిధిజ్ఞుండై
యజ్ఞాదికర్మసమితి మ
దాజ్ఞను జరుపంగవలయు నఫలాశుండై.

311


శా.

ఆ యజ్ఞాదులు చేసి తత్త్ఫలముపై నాసక్తి వర్జించి మ
న్మాయామోహితమైన యీ జగములో మధ్యస్థుఁడై కర్మమా
ర్గాయాసంబు పరిత్యజించి నరుఁ డత్యంతాత్మయోగంబునన్
గాయం బేర్పడకుండఁ దన్నవలయున్ సంసారబాహ్యస్థుఁడై.

312


గీ.

స్నానయాగదానతర్పణంబులు మాని
పుత్రదారవిత్తబుద్ధి మాని
గర్వ ముడిగి సర్వకర్మముల్ జరుపక
తలఁపులోన నన్ను దలఁపవలయు.

313