పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41. తలఁపు మఱపను వస్తుద్వితయము విడిచి,
శుద్ధమైన యవస్థందు సుస్థిరముగ
నిలిచి, యనుభూతిఁ గనువాఁడె నిత్యయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

42. మూఁడు ద్రోవలలోపల ముఖ్యమైన
నడిమిత్రోవను జని, లోన నాగకన్య
నూరడించినవాఁడె పో యుచిత యోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

43. ఎచట నేవంకఁ జూచిన నచటనెల్ల
దొడరి చిన్మయలింగమై తోఁచవలదె;
యదిగదా యోగసిద్ధికి నాలయంబు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

44. చదువవచ్చును వేదశాస్త్రంబులెల్ల;
బలుకవచ్చును తానెపో బ్రహ్మ మనుచు;
ననుభవజ్ఞుఁడు గానేర్చు టదియె యరుదు
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

45. పూయవచ్చును బట్టెఁడు బూడిదైన;
వేయవచ్చును రుద్రాక్ష వేలసంఖ్య;
సేయఁగా రాదు మనసు సుస్థిరముగాను,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

46. ఒక్కఁడే పోయి యడవుల నుండవచ్చు;
నీరుద్రావుచు బ్రాణము ల్నిలుపవచ్చు;
రాజయోగంబు సేయంగ రాదుగాక,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

47. వనధి లోఁతని చెప్పఁగా వచ్చుఁగాక;
మునుఁగవచ్చునె మేనెల్ల ముద్దగాను
సోఽహమనవచ్చుఁ; దన్నుఁ దాఁ జూచుటరుదు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.