పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84. సీ. అవనిలో నీరులో నగ్నిహోత్రంబులో
మారుతమునను వ్యోమంబులోను
సురలలో నరులలో గిరులలో చరులలో
దరులలో హరులలో కరులలోను
ఊళ్ళలో గూళ్ళలో రాళ్ళలో రోళ్ళలో
వేళ్ళలో గోళ్ళలో తేళ్ళలోను
ఇండ్లలో గుండ్లలో బండ్లలో నోళ్ళలో
చీమలో దోమలో పాములోను
గీ. అచలమైయుండు కాలత్రయంబులందు
బాధితములేక కేవల బ్రహ్మముండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

85. సీ. సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు
సృష్టి యున్నప్పుడు సృజనలేక
ప్రాగ్దక్షిణంబులుఁ బశ్చిమోత్తరముల
నాల్గుమూలలమీఁద నడుమక్రింద
నిష్కళంకంబయి నిర్వికారంబయి
ఘనతేజమై స్వప్రకాశ మగుచు
నచలమై స్వచ్ఛమై యాద్యంతశూన్యమై
పరిపూర్ణమై బట్టబయలుగాను
గీ. నేకమై యుండు నేబాధ లేక నుండు
నట్టివస్తువు కేవలాత్మనఁగఁబడును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.