పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

163


దేశప్రజల జీవనావసరములోని తారతమ్యము చూచిననుకూడా ఇది ఘోరముగానున్నది.” అని సైమనుకమిషనువారు కూడా వ్రాసియున్నారు. బ్రిటీషు సామ్రాజ్యతత్వము భారతీయులను నిరాధారులుగను దరిద్రులుగను మాత్రమేగాక నిరక్షరులుగను అజ్ఞానులుగనుకూడ చేసివైచినది. దేశములోని 35 కోట్ల 30 లక్షల ప్రజలలో 32 కోట్ల ప్రజలకు చదువను వ్రాయను రాదు. జబ్బులవలన అంటు జాడ్యములవలన నివారింపవీలుగల రోగములవలన ప్రతిసాలున లక్షలకొలది మరణించుచున్నారు. ఈ దేశములోని శిశుమరణములు బాలెంతమరణములు ప్రపంచములోని అన్ని దేశములకన్నను అధికము.

బ్రిటీషువారు తమ సామ్రాజ్య విధానమును చిరస్థాయిగా నడుపుటకొరకు మనదేశములో మొదటినుండి ప్రజల యభిప్రాయమును లెక్కజేయక నిరంకుశముగా అధికారము చలాయించు ఉద్యోగవర్గముగల రాజకీయవ్యవస్థ నెలకొల్పినారు. గవర్నరుజనరలును, గవర్నరులును శాసనసభల తీర్మానములను త్రోసివేసి వ్యవహరించుటకు వీలుగా వారికి అమితములగు అధికారము లివ్వబడినవి. వా రే శాసనమునైనను ప్రత్యాఖ్య(వీటో) చేయవచ్చును. బ్రిటీషువారి ప్రాబల్యమున కనుగుణముగా దేశాదాయ వ్యవహారములను నడుపవచ్చును. దేశాక్రమణ సైన్యమునకగు అత్యధిక వ్యయమునకు గావలసిన సొమ్ముకొరకు దారిద్ర్యమున మునిగియున్న ప్రజలపైన అత్యధికమగు పన్నులభారము విధింపబడియున్నది. శాంతిభద్రతలను కాపాడుటకొరకు, అధిక వ్యయకారణ మైన