పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

భారతదేశమున


II

మాంటేగూసంస్కరణములను కాంగ్రెసు తిరస్కరించెను. గాంధిమహాత్ముడు పంజాబువధల యవమానము భారతదేశస్వరాజ్యము వలనగాని తీరదనితలంచి దానిని సంపాదింప దీక్షవహించి సహాయనిరాకరణోద్యమము ప్రారంభించెను. ఆ మహోద్యమమున భారతదేశము తన దీర్ఘనిద్రనుండి మేల్కాంచినది. శాంతిసమరపద్ధతి యారంభమై ప్రజలు సాత్వికనిరోధము శాసనోల్లంఘనమునకు సిధ్ధపడిరి. కాని చౌరీచౌరాలో దౌర్జన్యము జరిగినందున మహాత్ముడు ఉద్యమము నాపివేసెను. అంతట ప్రభుత్వము విజృంభించి తీవ్రనిర్బంధ విధానమును సాగించి మహాత్మునిచెరకంపెను. తరువాత శాసనసభలో కాంగ్రెసు ప్రవేశించి పోరాడసాగెను. ఆధినివేశస్వరాజ్యచిత్తు రాజ్యాంగము తయారు చేయుట కొక రౌండుటేబిలుసమావేశము నాహ్వానించవలసినదని కేంద్రశాసనసభవారు 1924లో తీర్మానించిరి. మాంటేగూసంస్కరణల రాజ్యంగము లోప భూయిష్టమని అందలిమంత్రు లధికారవిహీనులుగా నున్నారని ఆ రాజ్యాంగము నడిపిన మితవాదులు జస్టిస్‌పార్టీ నాయకులు గూడ వెల్లడించిరి. అంతట ఆధినివేశస్వరాజ్యము వెంటనే ఇవ్వబడవలెనని సర్వపక్షసభవారు తీర్మానించగా నెహ్రూ కమిటీవారొక రాజ్యాంగము తయారుచేసిరి. ఒక్క సంవత్సరములో నిది యొసగనిచో పూర్ణస్వాతంత్ర్యము ప్రకటింతుమని కాంగ్రెసు తీర్మానించెను. రాజ్యాంగసంస్కరణలకొరకు దేశములో రాజకీయాందోళనము ప్రబలుచుండెను. భారత