పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

364

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


తులో కాంగ్రెసుసభను జరిపిరి. బారిసాలులో జరిగిన అత్యాచారములు స్వయముగా అనుభవించివచ్చినవారికి సూరతు కాంగ్రెసు పరిస్థితులు రోషము కలిగించెను. సూరతుకాంగ్రెసు సభలో తీవ్రవాదులకును మితవాదులకును గొప్ప వాగ్వాదమును పోరాటమును జరిగెను. మితవాదుల కోరికపైన పోలీసులు వచ్చిరి. సభలో చెప్పు లెగిరి సభభగ్న మయ్యెను. నాటితో కాంగ్రెసు రెండు చీలికలైనది. తీవ్రజాతీయవాదులు వేరుపడిరి. అప్పటినుండి 1916 వరకును మితవాదులే కాంగ్రెసులో బలము గల్గి యుండిరి. 1916 లో శ్రీమతి అనీబిసెంటుయొక్క "హోం రూలు" ఉద్యమముతో లోకమాన్యుడు మఱల కాంగ్రెసులో ప్రవేశింపగలిగెను. అంతట ఆనాటినుండి నేటివరకు కాంగ్రెసు తీవ్రజాతీయభావములతో స్వాతంత్ర్యముకొరకు పనిచేయుచున్నది.

IV

వందేమాతరోద్యమములోనే మన ఆంధ్రదేశమున జాతీయోద్యమము తీవ్రముగా విజృంభించినది. కాంగ్రెసు స్థాపనకు తోడ్పడిన దివ్యజ్ఞాన సమాజసభ్యులలో ఆంధ్రనాయకులగు తల్లాప్రగడ సుబ్బారావుపంతులుగారును, ప్రథమసమావేశమునకు పోయివచ్చిన కేశవపిళ్ల , రంగయ్యనాయుడు, శింగరాజు సుబ్బారాయడు, న్యాపతిసుబ్బారావు గార్లును ఆంధ్రదేశ జాతీయ చైతన్యమున కాదిపురుషులని చెప్పవచ్చును. న్యాపతిసుబ్బారావుపంతులుగారు కాంగ్రెసు కార్యదర్శిగా చాలకాలము పనిచేసిరి. కాని వందేమాతరోద్యమమువరకు దేశ