పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

358

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


నుండిరి. 1897లో గోఖలేగారు. ఇంగ్లాండుకువెళ్లి భారతదేశ ఆదాయ వ్యయములను గూర్చి “ వెల్బీకమీషను" ఎదుట సాక్ష్యమిచ్చుచు బ్రిటిషు వా రీదేశమునకు గావించిన అన్యాయము లెల్ల నుగ్గడించిరి.

ఆకాలములోనే భారతదేశమున ప్లేగు నివారణచేయు నెపమున చేయబడిన అక్రమములనుగూర్చి ఈయనకు తంతులు రాగా నీయన దానినిగూర్చివిశేషప్రచారముచేసిరి. ఈయన 1901 లోను 1902 లోను బొంబాయిశాసనసభలో సభ్యులై 1902లో కేంద్ర ఇంపీరియల్ శాసనసభలో సభ్యులై తమకుగల గొప్ప ఆర్థిక విజ్ఞానమునెల్ల గనబరచుచు కర్జను ప్రభువుయొక్క నిరంకుశ చర్యలను అన్యాయములను తీవ్రముగ విమర్శింపసాగిరి.

కర్జను ప్రభువు భారతదేశమునకు 1898 లో రాజప్రతినిధిగావచ్చెను. ఇతడు చాల చిన్నవాడు; తెలివైనవాడు; అయితే నిరంకుశుడు. కర్జనుకు బ్రిటిష్ రాజ్యమునకెల్ల తా నధిపతినను గర్వముండెను. ఇతడు సంస్థానాధీశులను విద్యాధికులను తృణీకరించుచుండెను. ఇతను మొదటి నాల్గువత్సరములలో చేసిన చర్యలు, ఆడినమాటలు దేశములోని విద్యాధికులకు వ్యవసాయకులకు సంస్థానాధీశులకుగూడ చాలా అసంతృప్తిని కలిగించి కల్లోలము కల్గించెను.

1900 సంవత్సరమున మఱల కఱవువచ్చి ప్రజలు మల మల మాడుచుండిరి. దాని నివారణకొరకు చేయబడినపని యతి స్వల్పము. ఇట్టిస్థితిలో 1903 లో ఢిల్లీచక్రవర్తుల నాటి డాబు దర్పములతో కర్జను ఢిల్లీలో నొక గొప్ప దర్బారు గావించి