పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశ స్వాతంత్ర్య విప్లవము

333


రంగిక శాంతి సత్పరిపాలనములవలన కలుగు అభివృద్ధిని, సాంఘికాభివృద్ధిని కలిగియుండవలెనని మాయుద్దేశము. మాయొక్క యితర ప్రజలపట్ల మేమెట్టి విధ్యుక్త బాధ్యతలను కలిగియున్నామో అట్టి బాధ్యతలనే భారతదేశములోని మానేటివు ప్రజలపట్లకూడ కలిగియుందుము. భగవంతుని కృపవలన మేమా బాధ్యతల నెల్ల సక్రమముగాను మనఃపూర్వకముగాను నిర్వర్తింతుము.

క్రైస్తవమత ధర్మముయొక్క సత్యముపైన సంపూర్ణ విశ్వాసమును మేము కలిగియుండియు, మతమునందలినమ్మకము వలన కలుగు శాంతికి కృతజ్ఞులమైయుండియు, మామతముల నితర ప్రజలపైన బలవంతము చేయుటకు మాకు హక్కుగాని కోరికగాని యున్నదని మేము చెప్పదలప లేదు. ఏమత విశ్వాసమునుగాని ఆచారములనుగాని పురస్కరించుకొని ఎవరికిని మేము అధికాదరమును అనాదరణమును చూపము. అందరును సమానముగా శాసనధర్మములయొక్క సంరక్షణను పొంది సుఖముగా నుండగలరు. మా క్రింద నధికారము వహించువా రెల్లరును మా ప్రజలయొక్క మతాచారములతో నెట్టిజోక్యము కలిగించుకొనగూడదు. వారట్లు చేసినచో మాయనుగ్రహమునకు పాత్రులు కాజాలరని హెచ్చరించుచున్నాము. ఏజాతిమతములకుజెందినవారైనను తగిన విద్య సమర్థత, నమ్మకముగల మా ప్రజలెల్లరు మా కొలువులోని యుద్యోగములందు నిష్పక్షపాతముగా వీలైనంతవరకు నియోగింపబడుటయే మా యభిమతము. వంశపారంపర్యపు హక్కులుకలిగిన భూములందు