పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశ స్వాతంత్ర్య విప్లవము

329


కోరు రాజ్యాంగ సంస్కరణములలో కొన్నిటినైన గావించుట యవసర మనియు నిశ్చయించిరి. భారతదేశములో వ్యాపించియున్న తీవ్రమైన అశాంతిని కేవలము దారుణకృత్యములతోను పశుబలముతోను అణచివేసి నంతమాత్రమున లాభము లేదనియు, దాని కారణములలో కొన్నిటినైనను తొలగించి నిజమైన శాంతిని కలుగజేయుట యవసరమనియు గ్రహించిరి. అంతట భారతదేశములోని కంపెనీ ప్రభుత్వమును రద్దుపరచి యిక ముందు దేశాక్రమణముజేసి రాజ్యములను కలుపుకొనమనియు ఉన్న సంస్థానాధీశులతో నెయ్యమును పాటింతుమనియు దేశప్రజల హక్కులను గాపాడెదమనియు దేశప్రజల మతములతో జోక్యము కలిగించుకొనమనియు ఇంక నేమేమో వాగ్దానములుచేయుచు తమ రాణీచేత ప్రకటింపజేసిరి.

“స్వదేశసంస్థానాధీశుల బిరుదులను, అధికారములును యథాప్రకారము ఆదరించెదము. వారు కంపెనీవారితో చేసికొనిన ఒడంబడికలన్నియు మన్నించెదము. క్రొత్త రాజ్యములను కలుపుకొని రాజ్యాక్రమణముచేయము; భారతీయుల ప్రాచీన సాంప్రదాయములను ఆచారములనుబట్టియే శాసనములును చేయుదుము; క్రైస్తవమత మవలంబింపుడని నిర్బంధింపము; ప్రజల ఆచారములకును, మతసిద్ధాంతములకును భంగముకలిగింపరాదని మాయుద్యోగులకు కట్టడిచేయుదుము; జాతి మత వర్ణ భేదములతో నిమిత్తములేకుండా శక్తిసామర్థ్యములనుబట్టియే ఉద్యోగముల నిచ్చెదము. భూస్వాములకు వంశపారంపర్యముగా సంక్రమించుహక్కులను కాపాడెదము.