పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

320

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఇంగ్లాండుకును రష్యాకును క్రిమియను యుద్ధము ప్రారంభమయ్యెను. క్రిమియను యుద్ధములో ఇంగ్లాండు సైనికులు విశేషనష్టము పొందుచున్న కథల నితడు పార్లమెంటుసభలో విని ఈ యుద్ధములో ఇంగ్లాండు దెబ్బతినినచో తన యజమానునికి లాభము కలుగునుగదాయని తలంచుచుండెను. అంతట నీమేధాశాలి ఆ యుద్ధభూమి కే తరలిపోయి ఐరోపాలోని వివిధరాజ్యముల జాతివారితో ఆలోచనలు చేయసాగెను. భారతదేశమునం దింత గర్వముతో ప్రవర్తించు నీఇంగ్లీషు వా రీయుద్ధమున నాశనమగుటకు సిద్ధముగా నున్నారని ఇతనికి తోచినది. అచ్చటి పరిస్థితులను జూచి ఈసమయమున భారతదేశమునగల రాజులును ప్రజలును ఏకమై ప్రయత్నించినచో నీ విదేశీయ ప్రభుత్వమును తొలగింపవచ్చునని యీ కుశాగ్రబుద్దికి తోచినది. ఈ తలంపులతో నితడు 1856 లో భారతదేశమునకు దిరిగి వచ్చెను. ఇతడు వచ్చిన కొద్ది రోజులకే అజీముల్లాఖానుతో కలసి నానాసాహెబు లక్నో నగరమునకు పోయినాడు. ఎందుకిట్లు వచ్చినాడో నాటి ఆంగ్లేయాధికారులు గ్రహింపలేదు.

నానాసాహేబు కాపురస్థలమగు బీదరు పరగణాయు,, అయోధ్య పరగణాయు నిట్లు అశాంతికి నిలయమై యుండగా ఆగ్రా పరగణాయం దెల్ల నీ అసంతృప్తి క్రమక్రమముగా వ్యాపించుచునే యుండెను. పూర్వమునాటి నుండియు ఆరాష్ట్రములందుగల గ్రామ పరిపాలనపద్దతిలో గ్రామాధికారులు వంశపారంపర్యముగా హక్కుగలిగియుండిరి.