పుట:ప్రబోధచంద్రోదయము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంకములు - విషయవిభజనము

ప్రథమాంకము - వివేకమహామోహపక్షవిచారము
ద్వితీయాంకము - మహామోహవిలాసము
తృతీయాంకము - పాషండవిడంబనము
చతుర్థాంకము - వివేకోద్యోగము
పంచమాంకము - వైరాగ్యప్రాదుర్భావము
షష్ఠాంకము - జీవన్ముక్తి

ఇందు ప్రతిపాదింపబడిన మతములు

అద్వైతము

సత్వమైన పదార్థము బ్రహ్మ యొక్కటియే మిగిలిన దంతయు మిథ్య. మాయ బ్రహ్మకల్పితము. బ్రహ్మము మాయతో కలిసి యొకపరమపురుషుడగును. అగ్నినుండి నిప్పురవలు బయలుదేరినట్లు బ్రహ్మనుండి వివిధచేతనాచేతనరూపములైన సమస్తము పుట్టినవి. వస్త్రమునందలి నూలు వస్త్రమునకు ముఖ్యకారణమై దానియందుండెడు రీతిని బాహ్యమైన ఆ బ్రహ్మము సమస్తమునకు ముఖ్యకారణమై అంతయు నిండియున్నది; ప్రతిజీవుని హృదయమునందు ప్రకాశించుచున్నది.

పరమపురుషునియందు మాయ సత్వగుణమునే కలిగియుండి అవిద్య అనబనుచున్నది. జీవుడు అవిద్యతో కలిసి యుండువరకు సత్యపదార్థమునకును తాను చూచుచున్నట్టి యితరమైన పదార్థములకును తాను భిన్నమని భావించును. అవిద్య జ్ఞానముచే నశించును. అవిద్య నశించినచో జీవమునకు బ్రహ్మైక్యము కలుగును. ఇదియే మోక్షము.

అవిద్యచేత బ్రమనొందుటయే సంసారము. తత్త్వమస్యాది వాక్యజన్యజ్ఞానంబున నవిద్య నశించును. ఇదియే మోక్షము.

ప్రబోధచంద్రోదయ నాటకమున బ్రహ్మము ఈశ్వరునిగను - అవిద్య లేక అజ్ఞానము ప్రబోధ చంద్రోదయము - జ్ఞానోదయముగను నిరూపితమై, జీవేశ్వరైక్యము ప్రతిపాదిత మైనందున నిది అద్వైతవేదాంతప్రతిపాదికనాటక మైనది.