పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

కృతిసమర్పణంలో సింగన నృసింహదేవుడు తనకృతిని మన్నిస్తా డనటానికి కారణాలు చెప్పినాడు.

క.

తనపేరిటివాఁ డనియును
తనదాసులదాసుఁ డనియుఁ దన కీకవితా
వనితామణి నిచ్చినవాఁ
డనియును రక్షించుఁగాత హరి నన్ను దయన్.

(I-19)

ఈ గ్రంథానికి అధికారి—

గీ.

అకట! భవపాశబద్ధుండనైన నాకు
వెడలఁ బ్రా పెద్దియో యని వెఱచుచున్న
యార్తుఁ డధికారియగుఁ గాని యజ్ఞుఁడైనఁ
దజ్జ్ఞుఁడైనను దీనికిఁ దగఁ డొరుండు.

(I-58)

మడికి సింగన కూర్చిన నాలుగోకృతి సకలనీతిసమ్మతము. ఇది మన తెలుగుసాహిత్యంలో మొదటి సంకలనగ్రంథం. దీనిని మానవల్లి రామకృష్ణ కవిగారు కనుగొని 1923లో ప్రకటించినారు. ద్వితీయముద్రణం 1970 ఆం. ప్ర. సాహిత్య అకాడమీ వారిది. శ్రీ నిడుదవోలు వెంకటరావు పోణంగి అప్పారావుల పరిష్కరణ మిది. పూర్వ మహాకవులకృతుల నుండి నీతిపద్యాలన్నీ యేరి ఒకప్రణాళికప్రకారం వర్గీకరించి అనుసంధించి సింగన దీనిని 5 ఆశ్వాసాల ప్రబంధంగా కూర్చి కందనమంత్రి అన్న కేసనమంత్రి రామగిరిపై ప్రతిష్ఠించిన కేశవేశ్వరునికి అంకితం చేసినాడు. ప్రస్తుతం మనకు దక్కినది మూడాశ్వాసాలకావ్యమే. ఇందులో 993 పద్యా లున్నవి. సకలనీతిసమ్మతంమూలంగా మరుగున పడిపోయిన అనేకకృతులు కృతికర్తలపేర్లు తెలియ వస్తున్నాయి. ఇది సంకలనగ్రంథమైనా సింగన తాను రచించిన ప్రబంధ మన్నాడు. ప్రబంధంలో వలెనే దీనిలో కృత్యవతరణిక, షష్ఠ్యంతాలు, ఆశ్వాసాద్యంతపద్యాలు, గద్యలు ఉన్నవి. ఇందులో 20 గ్రంథాలనుండి ఏరిన పద్యాలున్నవి.