పుట:పంచతంత్రి (భానుకవి).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

దమనకుఁ డను, హర్యక్షో
త్తమ! నీమదిఁ బొగుల నేల దర్పించిన గో
రమణు వధించితి హితకా
ర్యమునఁ దిరుగు[వేళ వే]చి తనఘగుణుఁడవై.

325


ఆ.

కైతవమున కధికకైతవం, బాదరం
బునకు నాదరమ్ము, వొసఁగు ననుచుఁ
దొల్లి వారకాంతతో నొక్కచిల్క ప
ల్కదె! యటన్న విని మృగప్రభుండు.—

326


వ.

ఏతదితిహాసం బెఱింగింపుమనిన, దమనకుం డిట్లని చెప్పందొడంగె,
ము న్నొక్కనగరంబున నిజభుజబలవిజితహరిదంతరుండును, బుండరీక
భవాండకరండపూరిత[యశః]కర్పూరప్రకాండుండును, నేకపత్నీవ్రతుండు,
నగు మహామండలేశ్వరుండు గలం, డతండు,—

327


క.

తనవీట నున్న వారాం
గనఁ, గలలో నొక్కనాఁడు కాయజుకేళిన్
దనియించితి నని కాంచి, మ
ది నద్భుతము వొడమి నిద్ర దేఱి నలఁగుచున్.

328


వ.

ప్రభాతం బగుడు నరేంద్రుండు నిజస్వప్నప్రకారంబు తనవద్ది
పురోహితులు కెఱింగించి వారల యనుమతంబునఁ దద్దోషపరిహారార్థం బు
చితదానమ్ము లొనరించి నిర్మలాంతరంగుఁడై యుండ, నవ్వార్త దిక్కులఁ
బొడమె, నట్టి యవసరమ్మున,—

329


సీ.

కీలుకొప్పున నున్న గేదంగిఱేకులు
                    నిందిందిరములకు విందు సేయఁ,
గలికిచూపులు భుజంగవ్రజంబులకును
                    మరుతూపు లగుచు మర్మములు గాఁడ,
గజకుంభవిజయంబు గైకొన్న చనుదోయిఁ
                    గస్తూరికాలక్ష్మిగరము మెఱయ,
నడపులమురిపమ్ము లెడనెడ నాగర
                    శిఖికులమ్మునకెల్ల సిగ్గు గఱప,