పుట:పంచతంత్రి (భానుకవి).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

కావున నీవేళ మనకు నిన్నటి భుక్తశేషమృగామిషం బనుభ
వింపవలయు, పోదమనిన దమనకుండు వానింజూచి యాహారమాత్రార్థి వెట్లు
రాజసేవ సేయనోపుదనినఁ గరటకుం డిట్లనియె.

76


చ.

పరుల మదంబుద్రెంచ దనబాంధవకోట్లను మన్చి దిక్కులన్
గురుతరకీర్తి నించ దనకోరికలెల్ల ఫలించ రాజశే
ఖరులను సజ్జనాళి కలకాలము గొల్చుటకాక, పొట్టకై
తిరముగఁ గొల్వనేల కులదీపక! విఠ్ఠయ లక్ష్మధీమణీ!

77


సీ.

ఉదరపోషణమున నుండదె కొక్కెర
                    చండియై జీవనస్థలములందు
శూద్రనివాసమ్ము చుట్టున నెంగిళ్లు
                    తినియుండదే కుక్క దినదినమ్ము
భోజనమ్ములుగ [ధరాజనోచ్ఛిష్టముల్,
                    కాకు లుండవె] చిరకాల మిలను
గ్రామసూకరములు కష్టవర్తనముల
                    బ్రతుకవే దేహాదిభ్రాంతిచేత


గీ.

పరుల రక్షింపనోపని నరులజన్మ
ములు దలంపఁగ నట్టివ యలఘుకీర్తు
లలఘుకార్యమ్ములకుఁ బూని యధికు లగుట
లాలితంబగు విఠ్ఠయ లక్ష్మధీర!

78


వ.

క్షుద్రనదీవిధంబున వివేకశూన్యుం డల్పజీవనంబునన్ బరిపూర్ణ
మనోరథుండగునని పలికినఁ గరటకుం డతనిం జూచి యిప్పు డుచితకార్యం
బెయ్యది చెప్పుమనిన నతం డిట్లనియె. మన విభుండగు మృగనాథుండు సాధ్వ
సమనంబునం బరివారసహితుండై యున్నవాఁ డనిన నది నీ వెట్లెఱుంగుదు
వని కరటకుం డడిగిన దమనకుం డిట్లనియె.

79


గీ.

పలికినంత నెఱుఁగు పశువులు, దలపోయ
సంజ్ఞ నెఱుఁగు దంతి, సైంధవములు
నొరుల యింగితమ్ము లూహ నెఱుంగుట
తెలివి, లక్ష్మమంత్రి! ధీసమేత!

80