Jump to content

పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఉరి విహగవ్రజంబునకు [1]నోదము దంతికి ముందు చిల్వకుం
బరుషతమోగ్రహగ్రహణబాధ సుధాంశున కంశుమాలికిం
బరమదరిద్రతాప్తి మతిమంతులకుం గలగంగఁజేసె నె
వ్వరు సవ తిందు నందు బలవంతుఁడు పో విధి నాకుఁ జూడఁగాన్.

30


చ.

గగనమునం జరించుపతగంబు లగాధసముద్రవారిలోఁ
దగ విహరించుమీలు వలతండములం బడి చచ్చు నవ్విధిన్
దెగి చన స్థానశక్తి గలదే వల దేర్పడఁ జింత దీనికై
తెగు నెడ కెంతదవ్వయినఁ దెచ్చుగదా విధి దేహధారులన్.

31


క.

అని [2]యాఖులేఖపతి నె, మ్మనమున నస్తోకశోకమగ్నుండై వ
చ్చిన యచ్చెలికానిఁ దగు, ల్కొనినయనాయాంశ మెచ్చి కొఱుకుచునుండెన్.

32


వ.

అప్పు డవార్యధుర్యతుహినగ్రావుండగు చిత్రగ్రీవుండు సుహృల్లోకశరణ్యుండగు
హిరణ్యకున కిట్లనియె.

33


క.

పరహితచరితా యస్మ, త్పరివృతబంధములఁబోలెఁ బరిచరబంధో
త్కర మేల నఱుక విప్పుడు, పరివారములేనిభూమిపతి పూజ్యుండే.

34


క.

సిరి గూడదు కూడినఁ బదు, గురుగలవాఁ డడఁచి పుచ్చుకొనుఁ బరవీరుల్
సరకుగొనరు సిరి దక్కదు, పరివారము లేనిరాజు బ్రతుకునె పొడవై.

35


వ.

అరునప్పలుకుల కలరి హిరణ్యకుండు.

36


క.

హితభృత్యులతో నేభూ, పతి కలఘుస్నేహసంవిభాగము లమరున్
బ్రతివాసర మతఁడు బలో, ద్ధతుఁడై పాలించుఁ జువ్వె త్రైలోక్యంబున్.

37


క.

పరివారముపట్టున నా, దరలేశము లేని భూమిధవుఁ డభివృద్ధిం
బొరయఁడు సంతతి కెడసిన, పురుషునివంశంబు నష్టిఁ బొందినభంగిన్.

38


చ.

అదననుజీవితం బిడమి యారజమాడుట లేనినేరము
ల్వెదకుట నిచ్చ న్పరిభవించుట కింకరసంకులంబు నె
మ్మదికి నసహ్య మౌట దయ మానుట [3]పిమ్మటనాడికో ల్మహీ
పదవికిఁ బాసి యొంటిపడు బాటులఁ బొందు నృపాలుచిహ్నముల్.

39


ఆ.

సైన్యధాన్యబంధుసమ్మర్ధముల నెవ్వఁ, డోర్సు గలిగి పుడమి నుల్లసిల్లు
నతఁడు సూవె నీడజాధీశ వసుమతీ, హిమమయూఖవదన కింటిమగఁడు.

40


క.

అని బలికి జాలగుణము, ల్దునియలుగాఁ జేసి ఖగపతుల వెడలించెన్

  1. ఓదము = ఏన్గులు కూలుటకై మఱుఁగుపుచ్చినగొయ్యి
  2. ఆఖులేఖపతి = మూషకేంద్రుఁడు
  3. పిమ్మటనాడికోలు = నున్నమొగము చా టైనతర్వాత దూషించుట