Jump to content

పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వారతీరంబుఁ దెప్పవై చేర్పుము న న్నీడేర్పుము నీ వని కనికరం బొలయఁ బ్రార్థించిన
బకంబునకుఁ గుళీరం బిట్లనియె.

744


క.

భువనవిహారివి నవలా, ఘవమును లావును గొఱంత గా దెన్నటికిన్
దివిరి వధియింతు వనిమిష, నివహము నీయంతవాఁడు నెగు లెట్లొందెన్.

745


క.

శోకార్తులకు నుపాయము, లేకరిణిం దోఁచు ధైర్య మెవ్విధిఁ గలుగున్
రాకడవోకడలకు జన, మేకొమరున దొరకుఁ గడఁక లెటువలె వొదవున్.

746


క.

ఐనను దీనికిఁ దగుతెఱఁ, గే నీ కెఱిగింతుఁ జేయు మిది భవదీయ
స్థానతరునికటబగతకా, దే నబిలంబునకు నకులదృఢబిలమునకున్.

747


క.

ఎడత్రెవ్వకుండ మీలం, దడవైవుము వానినెల్ల భక్షింపుచు నె
వ్వడి నేఁగి ముంగి పాముం, బడలుపడం గఱచి చంపుఁ బగ నీ కణఁగున్.

748


క.

చనుమని యాహారం బిడి, పనిచిన నప్పులుగు చనియెఁ బయనంబై త
ద్వనిత యెుకకొన్నినాళ్ళకు, గొనబై యచ్చోట గూఁట గ్రుడ్లం బెట్టెన్.

749


గీ.

పెట్టి ముదిగుడ్లు వడకుండఁ గట్టు గాచి, పొదుగుటయు వైరకొని కొన్నిపూఁటలకును
బికిల డింభంబు లాలోన బకవిభుండు, యెండ్రి చెప్పినగతి మీల నిండవైచె.

750


గీ.

కవుచు గాలివారఁ గవిఁ బాసి వెలువడి, వరుస మీల దినుచు వచ్చివచ్చి
పాము జంపి పాదపముఁ బ్రాకి బకశిశు, ప్రకరభుక్తిఁ దనిసి నకుల మరిగె.

751


ఆ.

ఒకఁడు సేయఁబోవ నొకఁడగు నీబుద్ధి, గూల నన్నుఁ జెఱుపకుము దురాత్మ
చెడిన నీవ చెడుము చెప్పకు మీమీట, యర్థభాండ మొల్ల నన్య మొల్ల.

752


క.

అని ముగియంబలికిన నా, ననమున దైన్యంబు దేఱ నందనుఁ డాసె
ట్టనకాళ్లమీఁదఁ బడి యిఁక, విను నావచనం బటంచు వేఁడుకొనంగన్.

753


తే.

మోసపోవనివాఁ డయ్యుఁ ముదుకఁ డయ్యు, విధివశంబునఁ జెవి వేలవ్రేసి సెట్టి
యర్థరాత్రంబునం దేగి యడగియుండె, గూబచందాన నలవృక్షకోటరమున.

754


వ.

అంతఁ గొంతప్రొద్దునకుం బద్మబాంధవుండు పూర్వపర్వతశిఖరసింహాసనం బెక్కె
నప్పుడు పిన్నపెద్ద లుభయవాదులు కావించి వృక్షసమీపంబునకు వచ్చి యర్చించి
యయ్యిరువురిలోన వంచకుం డెవ్వఁడు చెప్పుమని ప్రాంజలులై నిలిచిన.

755


క.

ఎలుగొందఁగఁ దరుకోటర, తలమున నద్దుష్టబుద్ధితండ్రి మహాని
ర్మలధర్మబుద్ధి సుగుణో, జ్వలు వంచకుఁ డనియె నెల్లవారు వినంగన్.

756


క.

అందఱు నమ్మాటకు వెఱ, గందిరి యలదుష్టబుద్ధి యానందమునం
జెంది నటియించెఁ బౌరుల, ముందరఁ గరతాళగతులు మొరియ న్నెరయన్.

757


ఆ.

ధర్మబుద్ధి వగచి తల యూఁచి తనలోన, ననియె నేఁడు సత్య మణఁగె ధర్మ
మవని వెల్లివిరిసె ననృతంబు చూచితే, నిర్నిమిత్త మిట్టినింద పుట్టె.

758