Jump to content

పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గళకుఁడు వల్కె నోదమనకా చనుదెంచితి వేమి నావు డు
జ్వలమతి నాతఁ డిట్లను భవచ్ఛరణంబులఁ గొల్వవచ్చితి
న్గెలసము దీనికంటెఁ బరికింపఁగ నెయ్యది నాకుఁ జెప్పుమా.

166


క.

సచివకుమారుఁడ నగునా, కుచితములగుపనులు గలిగియుండుఁగదా నా
వచనము విన దేవరకును, రుచియగుఁగద కార్యతత్పరుఁడఁగద మొదలన్.

167


మ.

శ్రుతికండూయన రుక్ప్రశాంతి యొనరించుం దంతనిర్ఘర్షణ
స్థితికిం జాలునఖాగ్రభిన్నయవసచ్ఛేదంబు విశ్వంభరా
పతికార్యంబుల నప్రయోజకుఁడె ప్రాప్తజ్ఞానచాతుర్యశౌ
ర్యతతోపాయన యప్రియాలపనమేధాకారశీలుం డిలన్.

168


చ.

పరమశుచి న్సమిద్బలు నపారమహామహు నుత్సవక్రియా
స్థిరు నిరసించి క్రిందుపడఁజేసినఁ గ్రిందుపడంగనేర్చునే
కెరలి యొకప్పుడేని దలక్రిందుగఁబట్టిన నూర్థ్వకీలుఁడై
దరికొన కంబుసంభవుఁ డధశ్శిఖుఁ డై నశియింపనేర్పునే.

169


చ.

హలికుఁడు విత్తు చేయఁబడునప్పు డెఱుంగఁడు చాలు చక్కనై
తలకొసఁ జూచి మంచిదిగదా యనుఁ బిమ్మట నట్లు రాజు సొం
పలరఁగఁ గూర్చునప్పుడు భటాలి నెఱుంగఁడు ప్రస్తుతంబున
న్గెలసముఁ బూని నిల్వఁ బరికించుఁ బ్రయోజకుఁ డంచు నెంతయున్.

170


తే.

అతిశయస్థానయోగ్యు నీచాసనమున, నునుచువిశ్వంభరావల్లభునకు నింద
మస్తకోచితకోటీరమండనములఁ, గాళ్ళఁ దొడివినయమ్మర్త్యుఁ గఱటి యనరె.

171


ఆ.

అధమవృత్తి కధికు నమరించుపతి దిట్టుఁ, గుడుచుఁ గాదె యారకూటకటక
కలితమణికి నిందగాద పొనర్చిన, కుత్సితుండు నిందఁగుడుచుఁ గాని.

172


క.

శిరమున మకుటము రశనా, భరణము కటి నూపురంబు పదమునఁ బోలెన్
గురుబంధుభటుల నిల్ప న, మరు నుత్తమమధ్యమాధమస్థానములన్.

173


చ.

పురుషవిశేషలీల విరిబోఁడియు వాలువిపంచిశాస్త్రమున్
దురగము వాణియు న్నరుఁడు దొడ్డతనంబు వహింతు రట్ల కా
పురుషవిశేషలీల విరిబోడియు వాలువిపంచి శాస్త్రమం
దురగమువాణియు న్నరుఁడు దొడ్డతనంబు వహింప రుర్వరన్.

174


వ.

ఇది సృగాలమాత్రంబు దీనిచేత నేమి యని న న్నవజ్ఞ సేయకుము.

175


క.

హరిసూకరరూపంబున, హరిణాదిమృగాకృతుల మహర్షు లజంబయి
హరిసుతుఁడు పూజ్యులైయుం, డరె వారలగౌరనంబు గరిమపడియెనే.

176