Jump to content

పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

పంచతంత్రము

పంచమాశ్వాసము



హిమగుప్రియతనయా
మోహస్నేహావలోకముగ్ధభ్రమర
వ్యూహసముపాస్యసిద్ధ
వ్యాహృతిమధుముఖసరోజ హరిహరనాథా.

1


వ.

దేవా యసమీక్ష్యకారిత్వాభిధానం బగుపంచమతంత్ర మాకర్ణింపు మధీతనీతిశా
స్త్రమర్ముం డగువిష్ణుశర్ముండు సుదర్శనకుమారుల కిట్లనియె.

2


క.

అపరీక్షితం బకార్యము, సుపరీక్షిత మభిమతంబు సురి మ్మెవ్వరి క
య్యపరీక్షతవిధిఁ గాదా, యుపతాపము పుట్టె విప్రయువతికిఁ బతికిన్.

3


క.

నావిని రాజకుమారకు, లావిప్రునిఁ జూచి పలికి రది వీనులవిం
దై వెలయఁగ నీకథఁ జెపు, మా వినియెద మనిన వారి కతఁ డిట్లనియెన్.

4


సీ.

గౌడదేశంబునఁ గలఁ డాగమాభ్యాసజడుఁడు విప్రుఁడు దేవశర్మ యనఁగ
నతఁడు సోమసుధాత్మసుత యాజ్ఞసేని నాఁ బెంపొందుకులకన్యఁ బెండ్లియయ్యె
సంతులే కలశరజ్జలజలోచన ఱాయి గన్నఱాతికిఁగుండు గన్నగుంటి
కెఱఁగుచు మఱుగుచు నెవ్వరేవ్రతములఁ జెప్పి రావ్రతములఁ జేకొనుచును


తే.

సుతులఁ గనిపెంచుగరితలఁ జూచి యేచి, యిచ్చ ముచ్చట నొఁదుచు నిట్టులుండ
గొంతగాలంబు వోయిన గొడ్డువీగి, కాంతిజితహేమసుమగర్భ గర్భమయ్యె.

5


సీ.

ఓఁకర బలిసె జిట్టుములసందడి మించెఁ గలకవాఱెఁ గపోలఫలకయుగళి
బుద్ధి మృద్భక్షణంబునకు నువ్విళులూఱె రశ్మి చామనమేన ఱచ్చజేసెఁ
గాళిమ గురుకుచాగ్రములఁ బాళెము డిగ్గె గార్శ్యంబునకు బొమ్మగట్టె నడుము
నిద్రారతిప్రీతి క్షేత్రంబులకుఁ గల్గె మురిపంబు ముంగర మోసులెత్తె


తే.

నరుచి యాహారసుఖముల నడ్డగించె, మధురరుచులకు నెదురెక్కుమానసంబు
నిర్భరశ్రాంతి నడకల నెలవుకొనియె, నక్కురంగేక్షణకుఁ జీర చిక్కుటయును.

6