పుట:నారాయణీయము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినతి - వినుతి

ఏతాదృశ భక్తికృతి మూలాధారమున రసనిస్రుతిం ధీ పేరకులై యస్మద్భాగ్య విధాతలై, కృతిసమర్పణ మహోత్సవమునకు నే నేగునపుడు చెన్నపురిలో మైలాపూరు సంస్కృత కళాశాలలో త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వర పరమాధిష్ఠానమగు స్వాధిష్ఠానమున నాకు దర్శనమిచ్చి, నారాయణీయ 'రాసక్రీడా' ఘట్ట సంఘటిత శ్లోకమణిపూరమున గంధర్వకన్యలనఁదగు నిర్వురు దాక్షిణాత్య కన్యల మధురతర సంగీతభంగిమ నవధరించు నెపమున స్వయోగ విభూతి నా యనుభూతికి వచ్చున ట్లేతత్కృతి సమర్పణోత్సవమున కతర్కితోపనత ప్రథమ మంగళము గావించి నన్నాదరించి;

“భగవదనుధావ" నా ద్యుజ్జ్వల రసభరిత భగవత్ప్రబంధకవి, గీర్వాణ రసధుని ఉట్రవిడియం కృష్ణశాస్త్రి మహోదయులను అభినవోద్ధవావతారులను కృతికర్తృ స్వీకర్తలకు భక్తులకును స్వప్రసాద మునిచి కేరళమునకు నాతో ననిచి నాపై కృప ననాహతస్థాన హృదయంగమము సేసి;

కృతి సమర్పణానంతరము సోదరుల మేము మరలివచ్చునపు డచ్చటనే కైలాసగిరి శంకరులువోలె ననేక సహస్ర భక్తగణ పరివేష్టితులై సభామండపమున నధిష్ఠించి, గురువాయూరు కృతివిశేషములను మా వానిచే నచుంబితమగు తమిళమునఁ బలికించి హసించియు, నారాయణీయ ప్రథమ శ్లోకాంధ్ర పద్యముల నాచేఁ జదివించి యాంధ్ర ద్రవిడ కేరళ రాష్ట్రముల వైజ్ఞానికమైత్రి నుగ్గడించి, యనిర్వచనీయ వచన రచన సమ్మోహన మొనరించి, రామకృష్ణ బహూకృతములయిన బంగరు శాలువలను స్వహస్త కమల స్పర్శమ్ముగ విశుద్ధ తేజమ్మునించి మమ్ముఁ గై సేయించి, పరమ మంగళాశాసనము నొనరించి; —

ఆ వెంటనే వేద ధర్మశాస్త్ర పరిపాలనసభ కాధ్యక్షమ్ము వహింప నాజ్ఞామధురముగఁ గేరళరాజ్య పాలకులను సన్నిధికి , రావించుకొని కటాక్షించిన;

శ్రీశ్రీశ్రీ కాంచీ కామకోటి పీఠాధీశ్వర జగద్గురు శంకరాచార్య గురుదేవుల దివ్యచరణ సహస్రార మకరంద రసధారాసారముల , క్షణక్షణ పునః పున రున్మజ్జనము గావించుచు సాష్టాంగ ప్రణతుండ నగుచుండెద . . ,