Jump to content

పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 13

నారసింహపురాణము. ఆ 3

55


గీ.

గరుడగంధర్వకిన్నరసురకుమార, వర్గములు [1]మేళగాఱు కైవడి నిజాను
కూలవృత్తిఁ జరింపఁ జకోరనయన, లసురకులనాథుపట్టనం బపుడు సొచ్చి.

73


వ.

విహరించు సమయంబున.

74


సీ.

ఉన్నయట్లన యుండి యూరక మధుమాస మఖిలాభిరామ మై యవతరించె
వలయయానములతో మలయానిలంబులు త్రొక్కనిచోటులు ద్రొక్కఁదొణఁగె
వలరాజు నెలరాజుఁ జెలికాఱుతనమున నిఖిలమోహనలీల నెళవుకొనియె
మరలఁ బ్రాయము వచ్చెఁ దరులతావితతికి మగువలకోపంపుమరులు మానె
గోఁకె హరిణిని హరిణంబు కొమ్ము చిమ్మి, చంచువును జంచువును గూర్చె నంచజోడు
తాపసులబ్రహ్మచర్యంబు తావుదలరె, నద్బుతోదయ మగుమాధవాగమమున.

75


వ.

అంత నొక్కకందువం బురందరప్రేషిత లగుయోష లశేషసంరంభసము
జ్జృంభితలై మురజంబులపై వైచిన బిరుదచామరంబులును బూదండలు సుట్టిన
దండియలును బురోవీథిమొరయుమలహరులం గలిగి వెలిహజారంబున నిండు
కొలువై యుండిన దానవమండలేశ్వరుం గని యతనికనుసన్న నుచితస్థానం
బుల నాశీనులై దేవా యీవచ్చినవార మెల్ల మును నల్లనేరేడుమ్రాని
క్రింద నీడలం గ్రీడించువారలము గంధర్వులకును మాకును సంబంధగం
ధంబు గల దలఘుతరప్రచారం బగునీకీర్తిసౌరంభంబు నాఘ్రాణించి శీఘ్ర
వేగంబున ద్విరేఫంబులం బోలె నేతెంచితిమి మమ్మం గరుణించి మాయాట
పాటలు పాటింపు మని వీణియలు తాటించి.

76


క.

[2]అపాతమధురగీతక, లాపంబున శ్రుతులు దనిపి లాస్యవిలాస
శ్రీపరిపాకమునఁ ద్రిలో, కీపతిడెందంబుఁ గరఁచి కేళీపరలై.

77


క.

నగవులఁ జూపుల మాటలఁ, దగవులఁ గందర్పశాస్త్రదర్శనముల నా
జగదేకత్యాగికి వా, రగణికపరమానురాగ మంరించుటయున్.

78


గీ.

నగరులోన నొక్కనాణెంబు లేకుంట, యెఱిఁగి హంసదైత్యుఁ డిచ్చెవారి
కన్ను దనియ హారకటకకేయూరకి, రీటపదకవలయకోటు లెల్ల.

79


ఉ.

ఇచ్చిన మెచ్చి పల్కి రసురేశ్వర యేటికి మాకు నీగి మా
వచ్చుట నిన్నుఁ గొల్చుటకు వచ్చుట యిచ్ఛక మింత లేదు మా
ముచ్చట దీరఁ గొన్నిదినముల్ భవదంఘ్రులు సేవచేసి నీ
నచ్చిన నాగవాసములనంటున నుండెద మన్న నాతఁడున్.

80
  1. మేళగారు
  2. ఆపాదమధుర