పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

నిలిచి గురుగృహంబున శ్రుతివిహరణపానభోజనాదుల హరిం
దలంపుచు బాహ్మకృత్యంబున జడుండువోలె వితర్కింపుచు జగం
బంతయు ననంతమయంబుగాఁ జింతింపుచు నున్న యాప్రహ్లాదునిం
జూచి గురుకులసహవాసంబులగు బాలురు శ్రుతి పఠనంబుఁ
జాలించి యిట్లనిరి.

161


చ.

దితికులమౌళిపుత్ర! భవదీయచరిత్ర మభోగలోభసం
గత; మది గాన నీమది నొకానొకతేజము వింత చేసి సం
తతపులకాంకురచ్ఛటలు దాల్చితి; చెప్పఁగ వచ్చె నెట్టు లీ
స్థితి? యెఱిఁగింపు నీమహిమ శ్రీకరమై జగము ల్నుతించఁగన్.

162


క.

దితిసుతసంప్రేషితవ
క్రతరోగ్రభటాహివహ్నికరిబాధలు లే
కతిసుఖమున నుండితి వీ
వితరసుఖప్రీతి నొందు దేమి కుమారా!

163

ప్రహ్లాదుఁడు దైత్యకుమారులకుఁ బరమార్థం బెఱింగించుట

వ.

అనిన విని మహానుభావులారా! మీర లడిగినయట్లనే నాకు నన్యాభి
లాషంబు లేదు. ధనజనరమణీవిలాసరమ్యం బైనయది భవంబు;
దాని వర్జింపవలయునో? సేవింపవలయునో? విబుధులం బరామర్శిం
పుండు; మొదల జననీజఠరంబులో నున్నవా రనుభవింపుదుఃఖంబు
వినుండు; కుటిలతనువులై, సదాగ్నితప్తులై, వివిధపూర్వజన్మంబులు
తలంపుచు నమేధ్యపంకలిప్తుండ నైతి. పూర్వంబున నీశ్వరస్మరణంబు
సేయనైతి; బహువిధబహుజన్మఖేదంబు లనుభవించి నిజహితం
బాచరించుకొనలే నైతి; మూఢుండ నైతి; మాతృభుక్తమహోగ్రకటు
లవణామ్లరసంబులచే దేహంబు తపింపుచున్నయది; యనవకాశంబువలన
నచలంబైన దుఃఖంబు ప్రాప్తించె; ఇదె హరిని మఱచిన ఫలంబు;
కారాగృహంబునఁ జోరుఁడువోలె జరాయువిట్క్రిమిమూత్ర
హేయంబైన మాతృగర్భంబునం బద్ధుండ నైతి; ఒకానొకప్పుడేని
ముకుందపాదస్మృతి సేయలేనైతి; నింకనేనియు నితరవాంఛ లుడిగి
హరిభజనంబు చేసెద; నెన్నఁడు గర్భంబు వెడలుదు నప్పుడె పూర్వ
మూఢత్వంబు వదలెద నని కోరుచు దారుబద్ధంబైన పశువు బంధనచ్యుతిఁ