పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కపిలదానంబు దుర్లభంబు. హరి వాసరంబున ధాత్రీఫలస్నానంబు
దుర్లభంబు. సామగ్రి గలిగి శీతోదకంబునం బ్రాతస్స్నానంబు
సేయుట దుర్లభంబు. ఏదియేని మాఘమాసంబునఁ జేయుట దుర్లభం
బిట్లెఱింగి యట్ల నీకార్యద్వయం బొనరింతు. మచ్ఛిరం బిచ్చెద,
సంధ్యావళిని దాసిఁగా నిచ్చెద రాజ్యం బిచ్చెద ననిన విని మోహిని
యిట్లనియె.

172


సీ.

శత్రుఁడే నాకు నో జననాథ ధర్మాంగ
                       దుండు సద్గుణశాలి దోషదూరుఁ
డతని నేటికిఁ జంప? హరివాసరమున భు
                       జించి నాతో గోష్ఠి చేసితేని
నాయభీష్టము తీరు నరనాథ! నీకుఁ బు
                       త్రునిమీఁద మోహంబు దోఁచెనేని
బద్ధప్రలాపముల్ పలుక నేమిటికి నే
                       నెయ్యది చెప్పిన హితముగాఁ ద


తే. గీ.

లంచి కావింపుమని యాదరించి పలుక
నలుక సేయక ధైర్యంపుమొలకవోలెఁ
దండ్రికడ నిల్చి ధర్మాంగదక్షితీశుఁ
డతని శాతాసి యిచ్చి యిట్లనియె నపుడు.

173

ధర్మాంగదుండు తన్నుఁ జంపుమని తండ్రిని గోరుట

శా.

ఆలస్యం బొనరింపఁ బాపము జగం బౌనౌ ననం దల్లి నేఁ
డాలోచించినమాట సేయుము యశస్యం బాత్మసంరక్ష భూ
పాలశ్రేణికిఁ జేయఁ జెల్లు సుతుచే భార్యాళిచే సొమ్ముచే
నీలోకంబుఁ బరంబు నీకుఁ దగు నీ విట్లుం బ్రవరిల్లినన్.

174


క.

దైన్యంబు విడువు దేహం
బన్యం బొక్కటి లభించు నామీఁద యశం
బన్యోన్యమునకుఁ దగు సా
మాన్యునికైవడిని నీవు మానం దగునే.

175


సీ.

అవనీసుపర్వార్ధమై జననీజన
                       కార్ధమై ప్రమదార్ధమై వసుంధ
రార్ధమై యధికకార్యార్ధమై దేవహి
                       తార్ధమై బాలార్ధమై వికలజ