పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్యాలను సైతం కథలో కలిసేవిధంగా రచియించడమే కారణం. ఉదాహరణకు ఏ ఆశ్వాసాన్నైనా పరిగ్రంహిచవచ్చును. దక్షుడు తన అల్లుళ్ళను అందరినీ చూచి చివరికి పరమేశ్వరుణ్ని చూదామని రజతనగానికి వెళ్తాడు. "పరమేశ్వరు నాస్థానంబున కరిగి" అనడంతో ప్రథామాశ్వాసకథాభాగం ముగుస్తుంది. ఆ తర్వాత అయిదు ఆశ్వాసాంతపద్యాలూ రెండవ ఆశ్వాసం మొదటిపద్యమూ ద్వితీయాంతాలుగా ఉన్నాయి. ద్వితీయాశ్వాసం కథాభాగం మొదటిపద్యంలో "సతి నవ్వించుచు నవ్వుచున్న పరమున్ సర్వేశు దక్షప్రజాపతి గాంచెన్" అని దక్షుడు ఈశ్వరుణ్ణి చూచినట్లు చెప్తాడు. ప్రథామాశ్వాసాంతపద్యాలు, ద్వితీయాశ్వాసం ఆదిపద్యం ద్వితీయాంతాలైన యీశ్వరవిశేషణయుక్తాలుగా సమన్వయం కుదిరి ప్రథమద్వితీయాశ్వాసాలకు ఏకవాక్యత యేర్పడుతుంది.

ఈశ్వరుని రోషభీషణాగ్నికి గురైన దక్షుడు తిరిగి ఆ పరముని దయావీక్షణంతో బంధముక్తుడై శంకరుని స్తుతించడంతో ద్వితీయాశ్వాసం ముగుస్తుంది. ఆ ముగింపులో కవి వాక్యంగా "అని యనేక ప్రకారంబులఁ బరమభక్తియుక్తిం బ్రస్తుతింప దక్షునకుం ద్రక్షుండు ప్రత్యక్షంబై తదీయాధ్వరఫలంబు సఫలంబుగా బ్రసాదించి దక్షుంబ్రజాపతి నియోగంబునంద నియోగించి" అని వ్రాసినాడు. ఆ తర్వాత తృతీయాశ్వాసంలో యీశ్వరుండు సర్వమునిదేవతాపరివృతుడై పరమానందంతో ఉన్నట్లు పేర్కొంటాడు. ఆ కారణంగా ద్వితీయ తృతీయాశ్వాసాలకు ఏకవాక్యత కుదరడానికై ద్వితీయాశ్వాసాంతపద్యాలను తృతీయాశ్వాసాదిపద్యాన్ని ప్రథమాంతాలుగా రచియించాడు. ఇదేపద్ధతిలో సమస్త ఆశ్వాసాలకు కథాభాగంతో ఐక్యత కుదురుతుంది. ఈవిధంగా కుమారసంభవం ఏకాశ్వాసకావ్యంగా రూపొందటం నన్నెచోడుని రచనలో బుద్ధిపూర్వకంగా జరిగినపనేగాని కాకతాళీయంగా జరిగిన పనికాదు. ఆయా ఆశ్వాసాలకాదిలో కథాభాగంతో ఆశ్వాసాద్యంతపద్యాలు సమన్వయించేవిధంగా రచించాలని నన్నెచోడుడు సంకల్పించుకున్నాడు కాబట్టే తత్తత్కథాసందర్భాల కనుగుణంగా అన్వయం కుదిరే విధంగా పూర్వపరకథావిధానాల ననుసరించి ఆశ్వాసాలతుదిని ఆదిని తగు విభక్త్యంతాలుగా పద్యాలునిర్మించాడు. పరమేశ్వరునికి మల్లికార్జునుడనే పేరుండడం, తన గురువు పేరు మల్లికార్జునుడు కావడం ప్రత్యేకంగా తనగురువుకు పరమేశ్వరునికి అభేదాన్ని చాటడం పరమేశ్వరుడే తన కావ్యకథానాయకుడు కావటం, యివన్నీ ఒకచోట సమకూరడంతో తనకావ్యాన్ని నన్నెచోడుడు ఏకాశ్వాసకావ్యంగాసైతం రూపొందేట్లుగా కథాకథనంలో ఆశ్వాసాలమధ్య సంపూర్ణమయిన సమన్వయాన్ని సాధించగల్గాడు. కుమారసంభవం మొదటినుండి చివరివరకూ ఏకవాక్యంగల కావ్యమనీ, ఆశ్వాసాంత్యగద్యలు తొలగించితే అది