పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-02 సామంతం సం: 02-451 కృష్ణ

పల్లవి:

అందుకుఁగాదు నేఁ గొల్చు టామీఁదిపని కింతే
ఇందు నందు నీవే కర్త విందిరారమణ

చ. 1:

ఇంచుకంత వేలఁ గొండ యెత్తిన దేవుఁడవు
ముంచి నాసంసారభారము మోవలేవా
అంచల దేవతలకు నమృతమిచ్చిన నీవు
కంచాన నన్నమువెట్టి కాచుట నన్నెంత

చ. 2:

వడి ద్రౌపది కక్షయ వలువలిచ్చిన నీవు
బెడఁగు నాకుఁ గట్ని(ట్టని?) చ్చి పెంచుటెంత
జడసి యింద్రాదులకు సంపదిచ్చినట్టి నీవు
కడు నాకు నైహికభోగము లిచ్చు టెంత

చ. 3:

పొసఁగ లోకములెల్లఁ బూర్ణుఁడవైన నీవు
వుసురై నాలోన (నే?) నీవు వుండుటెంత
వసుధ శ్రీవేంకటేశ వరములిచ్చే నీకు
దెస నాకోరికెలెల్లాఁ దీర్చుటెంత