పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0179-01 సాళంగనాట సం: 02-392 అంత్యప్రాస

పల్లవి:

జీవుని కేకాలము శ్రీహరి చేరువబంధువుఁడీతఁడు
భావములోపలి పెరరేపకుఁడై భక్తి చేకొనును యీతఁడు

చ. 1:

పరమున నిహమున వెంటవెంటనే పాయని బంధువుఁడీతఁడు
ధరఁ దనుఁదలచిఁన మారుకు మారై తా రక్షించును యీతఁడు
విరివిగ నింద్రియవిషయభోగముల విందులు వెట్టును యీతఁడు
వురుగతిఁ జిత్రపురూపుల దేహపుటుడుగర లిచ్చును యీతఁడు

చ. 2:

వడిఁ గలకాలము యిరువదియొక్కటవావుల బంధువుఁడీతఁడు
బడిబడిఁ జైతన్యంబై యిన్నిటఁ బనులకు నొదగును యీతఁడు
జడిగొని యేకాంతలోకాంతమై మతిసంగతి నాప్తుఁడీతఁడు
పొడలుచు వైదికలౌకికముల నొకపొత్తున గుడుచును యీతడు

చ. 3:

ఘననిధినిక్షేపములిచ్చేటి వుపకారపుబంధువుఁ డీతఁడు
అనయము వెరవకుమని యేకాలము నభయం బొసగును యీతఁడు
ననిచిన శ్రీవేంకటేశ్వరుఁడై యిటు నాపాలఁగలుగు నీతఁడు
పనివడి అరులను సూడువట్టి కడుఁ బగసాధించును యీతఁడు