పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213-01 దేసాక్షి సం: 03-073 అధ్యాత్మ

పల్లవి:

ఇతనికంటే నుపాయ మిఁక లేదు
మతిలోన నున్నవాఁడు మర్మమిదే సుండీ

చ. 1:

ఇన్ని లోకసుఖములు ఇంద్రియప్రీతులే
తన్నుఁ గనిన తల్లిదండ్రి తనుపోషకులే
కన్ను లెదిటిధనాలు కారణార్థములే
వున్నతి నిష్టార్థసిద్ది కొక్కఁడే దేవుఁడు

చ. 2:

కల దేవత లిందరు కర్మఫలదాతలే
లలి విద్యలెల్ల ఖ్యాతిలాభపూజల కొరకే
పలుమంత్రము లెల్లను బ్రహ్మలోక మీసందివె
వొలిసి ఇష్టార్థసిద్ది కొక్కఁడే దేవుఁడు

చ. 3:

అనుదిన రాజ సేవ లల్పార్థ హేతులే
కొనఁ గల్పవృక్షమైనఁ గోరిన విచ్చేటిదే
ఘన శ్రీవేంకటేశుఁడు కల్పించె జీవునిఁ గావ-
నొనర నిష్టార్థసిద్ది కొక్కఁడే దేవుఁడు