పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-01 దేసాళం సం: 03-061 శరణాగతి

పల్లవి:

తన సొమ్మీడేరించక తా మానీనా
పెనఁగుచు నే మూరకే బిగిసేముఁ గాక

చ. 1:

భూమితోఁ బ్రపంచ మెల్లఁ బుట్టించిన దేవుఁడు
ఆ మీఁది పారుపత్యాన కందుకోపఁడా
నామమాత్ర జీవులము నడుమంతరాల వచ్చి
నేము గర్తల మనుచు నిక్కేముఁ గాక

చ. 2:

యెనలేక యెదిరికి ఇనుమడిచేవారికి
తన తగర మడువఁ దడవయ్యీనా
గునిసి సంసారపు కొండనే మోచేనంటా
తినికేమిదియు వట్టి దీమసముఁ గాక

చ. 3:

చిత్తములో నున్నట్టి శ్రీవేంకటేశ్వరుఁడు
మత్తిల్లి ననుఁ గావక మానఁబొయ్యీనా
కొత్తగా నీతని నేఁడు కొలిచేమనుచు నేము
తత్తరపు స్వతంత్రానఁ దగిలేముఁ గాక