పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0292-02 దేవగాంధారి. సం: 03-531 వైష్ణవ భక్తి

పల్లవి:

కలదు తిరుమంత్రము కల దిహముఁ బరము
కలిమి గలుగు మాకుఁ గడమే లేదు

చ. 1:

కమలాక్ష నీవు మాకుఁ గలిగియుండఁగ భూమి
నమరలేని దొకటి నవ్వల లేదు
నెమకి నాలుకమీఁద నీ నామము మెలఁగఁగ
తమితోఁ బరుల వేఁడ దాఁ జోటులేదు

చ. 2:

శౌరి నీ చక్రము నాభుజముమీఁద నుండఁగాను
యీరసపుఁబగ లేదు యెదురూ లేదు
చేరువ నీసేవ నాచేతులపై నుండఁగాను
తీరని కర్మపువెట్టి దినమూ లేదు

చ. 3:

అచ్చుత నీపై భక్తి యాతుమలో నుండఁగాను
రచ్చలఁ బుట్టిన యపరాధమూ లేదు
నిచ్చలు శ్రీవేంకటేశ నీ శరణాగతుండఁగా
విచ్చిన విడే కాని విచారమే లేదు