పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0287-04 రామక్రియ సం: 03-503 హనుమ

పల్లవి:

పంతగాఁడు మిక్కిలి బంటతనమునను
అంతటాఁ గలశాపుర హనుమంతరాయఁడు

చ. 1:

నీరధి చంగన దాఁటి నెట్టన లంకచొచ్చి
శ్రీరాము నుంగరము సీతకిచ్చి
మేరమీరి యక్షుఁ గొట్టి మేటి వనము వెఱికె
ఆరయఁ గలశాపుర హనుమంతరాయఁడు

చ. 2:

ఘాతతో లంక గాలిచి గక్కన లంకిణిఁ జంపి
యీతలికి మగుడఁ దా నేతెంచి
సీతాశిరోమణి శ్రీరామునకు నిచ్చె
ఆతఁడే కలశాపుర హనుమంతరాయఁడు

చ. 3:

అల రావణుని గెల్చి అయోధ్యాపురికి వచ్చి
బలురాముని సీతతోఁ బట్టముగట్టి
నిలిచె శ్రీవేంకటాద్రినిలయుని యెదుటను
అలరెఁ గలశాపుర హనుమంతరాయఁడు