పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0285-06 దేసాళం సం: 03-493 దశావతారములు


పల్లవి :

అక్కటా రావణు బ్రహ్మహత్య నీకు నేడది
పుక్కిటి పురాణలింగపూజ నీకు నేడది


చ. 1:

గురుహత్య బ్రహ్మహత్యఁ గూడీ ద్రోణాచార్యు వంక
హరి నీ కృప నర్జును కవిలేవాయ
యెరవుగాఁ గల్లలాడి యేచిన ధర్మజునకు
పరగ నీ యనుమతిఁ బాపము లేదాయను


చ. 2:

అదివో రుద్రుని బ్రహ్మహత్య వాయఁ గాసి యిచ్చి
పొదలిననీ వతనిఁ బూజింతువా
అదనఁ బార్వతిదేవి కాతఁడే నీ మంత్రమిచ్చె
వదరు మాటల మాయావచనాలేమిటికి


చ. 3:

తగిలి నీ నామమే తారకబ్రహ్మమై
జగము వారి పాపాలు సంతతముఁ బాపఁగాను
మిగుల శ్రీవేంకటేశ మీకు నేడ పాతకాలు
నగుఁబాటు లింతేకాక నానాదేశముల