పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0275-04 రామక్రియ సం: 03-433 దశావతారములు


పల్లవి :

విచ్చేయవయ్యా వేంకటాచలముపొంత-
కచ్చుగా నేమున్నచోటి కచ్యుతనారాయణా


చ. 1:

అల్లనాఁడు లంక సాధించందరును బొగడఁగ
మల్లడి నయోధ్యకు మరలినట్లు
యెల్లగాఁ గైలాసయాత్ర కేఁగి కమ్మర మరలి
వెల్లవిరి ద్వారకకు విచ్చేసినట్లు


చ. 1:

యెన్నికతో గోమంతమెక్కి జయము చేకొని
మన్ననతో మధురకు మరలినట్లు
అన్నిచోట్లా నుండి అల్లిరము లారగించ
వెన్నుఁడవై వేడుకతో విచ్చేసినట్లు


చ. 1:

వహికెక్కఁ ద్రిపురాల వనితల బోధించి
మహి నిందిర వొద్దికి మరలినట్లు
విహగగమన శ్రీవేంకటేశ మముఁ గావ
విహితమై నామతిలో విచ్చేసినట్లు