పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0257-04 కన్నడగౌళ సం: 03-329 వైరాగ్య చింత


పల్లవి :

ఏమి సేయఁగల యెంతాశకుఁడను
తామసపు మనసు తనియదు నాకు


చ. 1:

యిలలోపల నూరేండ్లబ్రదుకే
కలవుద్యోగము కల్పాంతంబులు
నిలిచినవాఁడను నేనొక్కఁడనే
పలుసంసారము బండ్లకొలఁది


చ. 2:

ఆరయఁ బట్టెడు అన్నమువాఁడను
కోరిన కోర్కులు కోటానఁగోట్లు
నారవంటిదే నల్లెఁడు నాలుక
తీరవు రుచులివె తెప్పలకొలఁది


చ. 3:

నిరతరతిసుఖము నిమిషములోనిదే
విరహపు వెదలు వేవేలు
యిరవుగ శ్రీవేంకటేశ నీమఱఁగు
చొరఁగా నాకివి సులభములాయ