పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0247-06 పాడి. సం: 03-271 దశావతారములు

పల్లవి:

ఈతఁడు బలువుఁడౌట కివియే సాక్షి
యీతఁడు బ్రహ్మమౌట కీతఁడే సాక్షి

చ. 1:

అమరుల మొరాలించి అసుర బాధలు మాన్పె
అమరుల కెక్కుడౌట కదియే సాక్షి
అమృతము పంచిపెట్టి యాదిలక్ష్మిఁ గైకొనె
అమృతమథనమే అన్నిటికి సాక్షి

చ. 2:

యిందరుండే బ్రహ్మాండాలు యిదె కుక్షి నించుకొనె
యిందరి కెక్కుడగుట కిదియే సాక్షి
కందువ వరములిచ్చు కడ నెన్నఁడు జెడవు
కందువ పురాణాలలో కథలే సాక్షి

చ. 3:

ఆది బ్రహ్మఁ బుట్టించె మఱ్ఱాకుమీఁదఁ దుదఁ దేలె
ఆదినంత్య మీతఁడౌట కదివో సాక్షి
పాదుగా శ్రీవేంకటాద్రిపై మహిమ వెదచల్లె
పాదుకొన్నయీతని శ్రీపాదములే సాక్షి