పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0246-05 రామక్రియ సం: 03-264 దశావతారములు

పల్లవి:

నారాయణుఁడే సర్వనాయకుఁడు
వేరే దురాశలు వెదకఁ జోటేదయ్యా

చ. 1:

ఆకస మొకపాదము అట్టె భూమొక పాదము
పైకొని యొకపాదము పాతాళము
యేకమైనాఁ డేడనున్నా యిందులో వారే జీవులు
ఆకడఁ బరులఁ గొల్చేమనఁ జోటేదయ్యా

చ. 2:

కడుపులో జగములు కాయ మిన్నిటాధారము
యెడగలచోటనెల్లా యీతని మాయే
కడుఁబోరా దీతఁడే కారణ మందరికి
తడవి మరుపాయాలఁ దగులఁ జోటేదయ్యా

చ. 3:

చేతన్య మీతనిది సృష్టి యీతనిఘటన
ఆతుమ శ్రీవేంకటేశుఁ డంతర్యామి
రాతిరిఁబగలుఁ దానే రక్షకుఁడు మనలకు
పోతరించి ఇఁక మెచ్చి పొగడఁ జోటేదయ్యా